హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందిన చిత్రం ‘నరుడా.. డోనరుడా..’. ఈ సినిమాలో తనికెళ్ళ భరణి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు తనికెళ్ళ భరణి విలేకర్లతో ముచ్చటించారు.
వారి నరకం మనం వర్ణించలేం..
‘విక్కీడోనార్’ సినిమా చూసినప్పుడు నాకు కల్చరల్ షాక్ కలిగింది. ఇలాంటి ఓ కథను మన తెలుగు వారు ఆదరిస్తారా అనిపించింది. కానీ పరిణామ క్రమంలో యాక్సెప్టెన్స్ అనేది వస్తోంది. కాకపోతే ఇది చాలా సున్నితమైన అంశం. పిల్లలు లేనివాళ్లకయితే వారి నరకం మనం వర్ణించలేం. అలాంటి వాళ్ల కోసం ఫెర్టిలిటీ సెంటర్లు కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా మందికి తెలియదు. అవసరం ఉన్న వారికి తప్ప.
అలాంటి కథ బోల్డ్ గా హిందీలో బాగా చెప్పాడు. తెలుగు వచ్చేసరికి ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ జోడించి సాఫ్ట్ గా చెప్పాం.
రైటర్ గా ఇన్ పుట్స్ ఇవ్వలేదు..
ఈ సినిమాకు రాసిన ఇద్దరు కుర్రాళ్ళు ముచ్చటపడేలా రాశారు. రచయితగా ఈ సినిమా కోసం ఎలాంటి ఇన్ పుట్స్ ఇవ్వలేదు.
బాధ్యతగా తీసుకున్న సినిమా..
‘యమలీల’ అనే సినిమాలో హీరోకి సమానంగా ట్రావెల్ అయ్యాను. కనకమహాలక్ష్మి సినిమాలోనూ అంతే. విలన్ వేషాలు వేసినప్పుడూ అంతే. మామూలుగా కేరక్టర్ ఆర్టిస్టులకి ఒక వారం, ఒక రోజు, ఒన్ షాట్ అలాంటివి వస్తుంటాయి. కానీ ఈ సినిమా మొత్తం నేను ఉంటాను. ఒక బాధ్యతగా తీసుకున్న సినిమా ఇది. నా స్థాయిని మరింత పెంచుతుంది.
ఒక షాట్ చేసినా.. ప్రేమ ఉంటుంది..
ఒక షాట్ చేసినా సినిమాపై ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ‘అతడు’ సినిమాలో నేను చేసింది నాలుగు రోజులే. కానీ 40 రోజులు చేసిన సినిమాలంత గుర్తింపు తెచ్చిపెట్టింది. ఒక రోజు వేషమైనా మనం చేయగలిగింది కాబట్టే మనల్ని పిలిచారు కదా. లేకపోతే ఇంకెవరినైనా పిలిచేవారేమో అనే గౌరవం, సరే ఒక్క సీన్‌లో మనం ఏం చేయగలమో చూద్దాం అనే ఛాలెంజ్.. ఇవన్నీ కలిసి మమ్మల్ని సమాయత్తం చేస్తాయి.
అక్కినేని హీరోలందరితో పనిచేశా..
అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావుగారితో వర్క్ చేశా. నాగార్జునతో చేశా. కుటుంబంలో అందరితో కలిసి పని చేశా. సుమంత్‌తో చాలా సినిమాలు చేశాను. గోదావరి, సత్యం, గోల్కొండ హైస్కూల్. తన కెరీర్ లో సక్సెస్ రేట్ బాగానే ఉంది.
అందరు ఒకటే అనే భావన..
సెట్స్ లో సీనియర్ నటులను సెపరేట్ గా హీరోలను సెపరేట్ గా చూడరు. ఒకప్పుడు ఇలాంటి ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు అందరు ఒకటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉంది. మన పని మనం చేసుకోవడం.. వెళ్లిపోవడం అంతే.. సినిమా ఇండస్ట్రీలో ఆరోగ్యకరమైన వాతావరణమే ఉంది.
A నుండి Z వరకు సుమంతే..
ఈ సినిమా టైటిల్ మొదట ‘తెలుగు వీర లేవరా..!’ అనుకున్నాం. కానీ కథకు సెట్ అయ్యే విధంగా ‘నరుడా డోనరుడా’ అని సెలక్ట్ చేశారు. ఈ సినిమాకు A నుండి Z వరకు అన్నీ సుమంతే..
ఏ సీన్ కాపీ చేయను..
రచయితగా నేను రాసే సినిమాలకు, నేను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక్క డైలాగ్ కానీ, పంచ్ కానీ ఎక్కడ నుండి నేను కాపీ చేయను. నా దృష్టిలో అది క్షమించరాని నేరం. నాకు రాసే దమ్ము ఉంది. కాకపోతే ఒక సినిమా కథ రాయడానికి మూడు నెలలు కనీస సమయం తీసుకుంటాను.
ఆ సినిమా నేను డైరెక్ట్ చేయను…
భక్త కన్నప్ప కథ రాసుకున్నాను. మంచు విష్ణు వాళ్ళు అడిగారని ఇచ్చేసాను. ఆ కథను నేను డైరెక్ట్ చేయడంలేదు.