HomeTelugu Newsనా లైఫ్ లో అదే పెద్ద మార్పు!

నా లైఫ్ లో అదే పెద్ద మార్పు!

బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’ అనే సినిమాను తెలుగులో హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్స్‌తో క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా.. హీరో సుమంత్ విలేకర్లతో ముచ్చటించారు.
ఇలాంటి బోల్డ్ సబ్జెక్టును ఎన్నుకోవడం సాహసం అనిపించలేదా..?
కొన్ని సార్లు సాహసం చేయక తప్పదు. నాకు కమర్షియల్, మసాలా సినిమాలంటే చాలా ఇష్టం. కానీ నేను అలాంటి సినిమాల్లో నటించలేను. నాకు కథలో కొత్తదనం ఉండాలి. ఎంటర్టైన్మెంట్ తో పాటు కొత్తగా ఉండే పాయింట్ ప్రేక్షకులను చెప్పాలనుకున్నాను. అలానే ఈ సినిమా 2012 లో వచ్చినప్పుడు తాతగారు టీవీలో చూసి తెలుగులో ఎవరైనా చేస్తే బావుంటుందని అన్నారు. ఇక నేనే చేయాలనుకున్నాను.
చాలా కాలం గ్యాప్ తీసుకున్నట్లున్నారు..?
కావాలని తీసుకోలేదు. ఈ సినిమా రీమేక్ రైట్స్ వేరే ఎవరిదగ్గరో ఉన్నాయని నేను విన్నాను. నిజానికి ఈ సినిమా హక్కులు ఎవ్వరూ కొనలేదట. అదంతా పుకారే అని ఆ సినిమా ప్రొడ్యూసర్ జాన్ అబ్రహంని సంప్రదిస్తే తెలిసింది. జాన్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నేనడగగానే రీమేక్ హక్కులు ఇచ్చేశాడు. అదీ కాకుండా రీమేక్ చేయాలనుకున్న సమయంలో తాతగారు చనిపోయారు. నా లైఫ్ లో పెద్ద మార్పు అది. పెర్సనల్ గా చాలా ఎఫెక్ట్ అయ్యాను. అప్పటివరకు తాతగారితో ఒకే ఇంట్లో ఉండే నేను సడెన్ గా ఒక్కడినే
ఉండడం నేను జీర్ణించుకోలేకపోయాను. వాటి నుండి బయట పడడానికి కాస్త సమయం పట్టింది.
తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో.. లేదో అనే భయం లేదా..?
అలాంటి భయం ఎప్పుడూ లేదు. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్. ఇంకా చెప్పాలంటే ఇది బాలీవుడ్‌లో ఒక్క మల్టీప్లెక్స్ సినిమాగా మాత్రమే కాక అంతటా ఆడింది. ఇక్కడా అలాగే అందరూ ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. విక్కీ డోనార్ కంటే ఈ సినిమా ఇంకా బోల్డ్‌గా ఉంటుంది.
పోస్టర్స్ బట్టి సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉంటుందనిపిస్తుంది. నిజమేనా..?
ఇది పక్కాగా అందరూ చూసే సినిమా. బోల్డ్‌గా ఉంటుంది కానీ, ఎక్కడా వల్గారిటీ, అడల్ట్ కంటెంట్ ఉండదు. సెన్సార్ వాళ్ళు కూడా యూ/ఏ రేటింగ్ ఇచ్చారు. ఇది హాట్ సినిమానో, ఏ రేటెడ్ సినిమానో అయితే కాదు.
ఈ సినిమాకు మీరు ప్రొడక్షన్ పనులు చూసుకోవడం ఎలా అనిపించింది..?
నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను, తనికెళ్ళ భరణి గారు తప్ప మిగతా అందరూ కొత్తవారే! వాళ్ళందరినీ ఒక టీమ్‍గా చేసుకొని, ప్రొడక్షన్ చేయడం పెద్ద బాధ్యతలాగే కనిపించింది. ఏ సినిమా కోసం ఇంతగా కష్టపడలేదు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్‌పై గౌరవం మరింత పెరిగింది.
మీ కుటుంబంలో చైతు, అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నారు. మీకు పెళ్ళి ఆలోచన ఏమైనా ఉందా?
అఖిల్, చైతన్యల పెళ్ళిళ్ళకు వెళ్ళడమే కానీ నేనైతే పెళ్ళి చేసుకోదల్చుకోలేదు. ఇప్పుడంతా బాగానే ఉంది కదా! ఇలా సినిమాలు చేసుకుంటూ బాగానే ఉన్నా. అందరూ పెళ్ళి చేసుకోవాలని ఏమీ లేదు.
ఎలాంటి పాత్రల్లో నటించాలనుంది..?
నాకు విలన్ పాత్రల్లో నటించడమంటే చాలా ఇష్టం. రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధనుడు అంటే నాకు బాగా ఇష్టం. అలాంటి స్ట్రాంగ్ విలన్ పాత్రలు నా దగ్గరకు వస్తే ఖచ్చితంగా
నటిస్తాను. ఒకప్పుడు ఇలా స్ట్రాంగ్ విలన్ పాత్రలు ఉండే కథలు రాసేవారు. ఇప్పుడు కూడా బాహుబలి, ధ్రువ వంటి సినిమాల్లో అటువంటి విలన్ పాత్రలు కనిపిస్తున్నాయి. రామారావు, మోహన్ బాబు, చిరంజీవి వంటి హీరోలు విలన్ పాత్రలు చేసినవారే..
డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా..?
లేదండీ.. భవిష్యత్తులో నిర్మాతగానే కంటిన్యూ అవుతా..
తదుపరి చిత్రాలు..?
నాలుగైదు కథలు ఉన్నాయి. కానీ ఏది ఫైనల్ చేయలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu