‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’.. వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈ సంస్థ నుంచి వస్తోన్న నాల్గోవ చిత్రం ‘సవ్యసాచి’. నాగచైతన్య హీరోగా నటించారు. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా నవంబరు 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నవీన్, మోహన్, రవి శంకర్ మీడియాతో మాట్లాడారు. తమ నిర్మాణ సంస్థ గురించి ముచ్చటించారు.
* ఒక నెల వ్యవధిలో.. సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ.. విడుదల అవుతున్నాయి. డిసెంబరులో చాలా సినిమాలున్నాయి. మరోవైపు తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. జనవరిలో ఎలాగూ బాక్సాఫీసు ఖాళీగా ఉండదు. మరో మార్గం లేక.. ఒక నెలలో రెండు చిత్రాల్ని విడుదల చేయాల్సివస్తోంది.
* మేం ముగ్గురం కలిసే కథలు వింటాం. కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. ఈ కథ వద్దు.. మరో కథ చెప్పండి.. అనే అవకాశం మా దర్శకులు మాకెప్పుడూ ఇవ్వలేదు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం.. కథలు చెప్పగానే నచ్చేశాయి. సవ్యసాచి కూడా అంతే. వరుసగా మూడు విజయాలొచ్చాయి. ఆ విజయాల్ని కాపాడుకోవాలన్న భయంతో కథల్ని ఎంచుకుంటున్నాం.
* గతేడాది సెప్టెంబరులో చందూ మొండేటి సవ్యసాచి కథ చెప్పారు. కాన్సెప్ట్ కొత్తగా అనిపించింది. యాక్షన్‌కీ, వినోదానికి, ఎమోషన్‌కీ ప్రాధాన్యత ఉన్న కథ ఇది. ట్రైలర్ చూసి యాక్షన్ సినిమా అనుకోవద్దు. రెండే రెండు పోరాట దృశ్యాలున్నాయి. అవి కూడా సాధారణ చిత్రాల్లో కనిపించే ఫైట్స్‌లా ఉండవు. మాధవన్ పాత్ర చాలా కీలకం. కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చేసింది. సెట్లో తన పాత్రకు మరిన్ని మెరుగులు దిద్దారు. ద్వితీయార్ధం మొత్తం చైతు-మాధవన్‌లపైనే సాగుతుంది.
* నిన్ను రోడ్డుమీద చూసినదీ.. రీమిక్స్ కోసం తమన్నాని అనుకున్న మాట నిజమే. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాం. ఇది కాలేజీ నేపథ్యంలో సాగే కథ. పాట కూడా అక్కడే వస్తుంది. సడన్‌గా కాలేజీలోకి తమన్నా వచ్చి డాన్స్ చేయడం.. ఆ కథలో, ఆ సందర్భంలో సరికాదనిపించింది. అందుకే ఆ ప్రతిపాదన పక్కన పెట్టాం.
* పెద్ద సినిమాలే తీద్దామని చిత్రరంగంలోకి అడుగుపెట్టాం. కానీ క్రమంగా మాకు మార్కెట్ అర్థమైంది. మధ్య స్థాయి సినిమాలు కూడా బాగా రాణిస్తున్నాయి. అందుకే ఆ తరహా చిత్రాలకు రూపకల్పన చేశాం. కథ నచ్చితే చిన్న సినిమాలూ చేస్తాం. త్వరలో ఓ కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఓ సినిమా తీస్తున్నాం. బడ్జెట్ రూ.1.5 కోట్లు మాత్రమే.
* పవన్ కల్యాణ్‌తో సినిమా చేద్దామనుకున్నాం. ఆయన రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల కుదర్లేదు. ఆయన దగ్గరి నుంచి అడ్వాన్సు వెనక్కి తీసుకున్నామన్న మాటలో నిజంలేదు. త్వరలోనే పవన్‌తో ఓ సినిమా చేస్తాం.
* మహేష్‌బాబు- సుకుమార్ కాంబినేషన్‌లో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సుకుమార్ కథని సిద్ధం చేసేశారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పట్టాలెక్కుతుంది. రజాకారుల ఉద్యమ నేపథ్యంలో సాగే కథ అని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. రవితేజతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. తేరీ కథని రవితేజ శైలికి అనుగుణంగా మార్పులు చేసి తెరకెక్కిస్తాం. సాయిధరమ్ తేజ్‌తో చిత్రలహరి త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్తున్నాం. మొత్తానికి ఓ పది చిత్రాల వరకూ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే ఏడాది 5 చిత్రాలు విడుదల చేస్తాం.