రిటైర్మెంట్ చర్చను పక్కకు పెడుతూ.. వెస్టిండీస్ పర్యటనకు సెలవిస్తూ ప్రాదేశిక సైన్యలోకి చేరాలని భావించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మా ధోనికి దేశభక్తి ఎక్కువ.. అంటూ క్రికెట్ భారతం ఉబ్బితబ్బిబ్బై పోతుంది. పలు సందర్భాల్లో దేశం, సైన్యంపై ధోని చూపించిన ప్రేమను నెమరవేసుకుంటోంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ డేవిడ్ లాయడ్.. ధోనిని ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు వారందరిని ఆగ్రహానికి గురిచేసింది.
ధోని తన సమయాన్ని ఆర్మీకి కేటాయించబోతున్నాడంటూ వచ్చిన వార్తల పట్ల ఈ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కాస్త వ్యంగ్యంగా స్పందించాడు. ‘కాల్ ఆఫ్ డ్యూటీ.. సైన్యంలో చేరే ఉద్దేశంతో ధోని విండీస్ పర్యటనకు దూరం కానున్నాడు’ అంటూ ఓ స్పోర్ట్స్ చానెల్ చేసిన ట్వీట్‌కు ఎగతాళిగా పశ్చాతాపంతో నవ్వుతున్నట్టుగా ఉన్న ఎమోజీలతో రీట్వీట్ చేశాడు. ఇది భారత అభిమానులకు ఎక్కడ లేని ఆగ్రహాన్ని తెప్పించింది. వెంటనే సోషల్ మీడియా వేదికగా ఈ ఇంగ్లీష్ మాజీ క్రికెటర్‌పై ట్రోలింగ్‌కు దిగారు. ‘9 టెస్ట్‌లు ఆడిన నువ్వా.. మా ధోని గురించి మాట్లాడేది’ అని ఒకరంటే.. ఈ ముసలాయనకు పళ్లతో పాటు మెదడు కూడా లేనట్టుందని మరొకరు ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.
మన దేశానికి స్వాతంత్య్రం రాక ముందు జన్మించిన డేవిడ్ లాయడ్ ఇంగ్లండ్ తరఫున 9 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు. భారత్‌పై తొలి టెస్టు ఆడిన డేవిడ్.. విండీస్‌పై తొలి వన్డే, చివరి వన్డే ఆడాడు. అనంతం కామెంటెటర్‌గా బాధ్యతలు చేపట్టాడు.
— David 'Bumble' Lloyd (@BumbleCricket) July 20, 2019