అక్కినేని యంగ్ హీరో తన తొలి రెండు సినిమాలు ‘అఖిల్’, ‘హలో’ తో అభిమానులను నిరాశపరిచాడు. అయితే తన మీద ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయాడు. దీంతో మూడో సినిమాగా తన వయసుకు తగ్గ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిప్రేమ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి, అఖిల్‌ను ప్లేబాయ్‌గా చూపించాడు. మరి ఈ ఎమోషనల్ లవ్‌స్టోరితో అయినా అఖిల్ సక్సెస్ అందుకున్నాడా..? దర్శకుడు వెంకీ అట్లూరి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడా..?
కథ : మూడో ప్రయత్నంగా అఖిల్ తెలుగు తెర మీద చాలా సార్లు చూసిన రొటీన్ ప్రేమకథను ఎంచుకున్నాడు. విక్రమ్ కృష్ణ అలియాస్ విక్కీ (అఖిల్ అక్కినేని) లండన్‌లో ప్లేబాయ్‌లా అమ్మాయిలతో సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిల విషయంలో ఎలా ఉన్నా విక్కీ వ్యక్తిత్వం నచ్చి నిఖిత అలియాస్ నిక్కీ (నిధి అగర్వాల్) అతడిని ఇష్టపడుతుంది. కానీ నిక్కీ ప్రేమను అర్థం చేసుకోలేని విక్కీ ఆమెను దూరం చేసుకుంటాడు. కానీ నిక్కీ దూరమైన తరువాత తాను కూడా నిఖితను ప్రేమిస్తున్న విషయం విక్కీకి అర్థమవుతుంది. దూరమైన ప్రేమ కోసం విక్కీ ఏంచేశాడు..? తిరిగి ఇద్దరూ ఎలా కలుసుకున్నారు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు : అఖిల్ తన వయసుకు తగ్గ పాత్రలో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో ప్లేబాయ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. లుక్స్ పరంగా మన్మథుడిని గుర్తు చేశాడు. యాక్షన్ సీన్స్, డాన్స్‌లతోనూ ఆకట్టుకున్నాడు. నటన పరంగా ఎమోషనల్ సీన్స్‌లో కాస్త ఇబ్బంది పడినట్టుగా అనిపిస్తుంది. నిఖిత పాత్రలో నిధి అగర్వాల్ ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. తెర మీద చాలా పాత్రలు కనిపించినా ఎవరికీ పెద్దగా స్కోప్ లేదు. సితార, పవిత్ర లోకేష్, నాగబాబు, జయప్రకాష్, రావూ రమేష్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకోగా సుబ్బరాజు, ప్రియదర్శి, హైపర్ ఆది కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారు.
విశ్లేషణ : తొలిప్రేమ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి.. అఖిల్ కోసం రొటీన్ లవ్ స్టోరినే తీసుకున్నాడు. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ రెండో ప్రయత్నంలో వెంకీ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్ ఎంటర్‌టైన్మెంట్, ఎమోషనల్ సీన్స్‌తో బాగానే నడిపించినా.. సెకండ్ హాఫ్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం కూడా ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టుగా సాగుతూ ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. రచయితగా మాత్రం వెంకీ తన మార్క్ చూపించాడు. చాలా డైలాగ్స్ గుర్తుండిపోయేలా ఉన్నాయి. జార్జ్ సీ విలియమ్స్ సినిమాటోగ్రఫి మేజర్ ప్లస్ పాయింట్. హీరో హీరోయిన్లతో పాటు లండన్ అందాలను కూడా చాలా బాగా చూపించాడు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
టైటిల్ : Mr మజ్ను
నటీనటులు : అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, నాగబాబు, సుబ్బరాజు, ప్రియదర్శి
సంగీతం : ఎస్ తమన్
దర్శకత్వం : వెంకీ అట్లూరి
నిర్మాత : బీవీయస్‌ఎన్ ప్రసాద్
హైలైట్స్
ప్రథమార్ధం
డ్రాబ్యాక్స్
ద్వితీయార్ధం
చివరిగా : యువ మన్మధుడు ఈ ‘Mr మజ్ను’
(గమనిక :ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)