ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వెంకట్రామిరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. విజయ వాహిని సంస్థల వ్యవస్థాపకుడు నాగిరెడ్డి అనంతరం విజయా ప్రొడక్షన్ పై పలు చిత్రాలను నిర్మించిన వెంకట్రామిరెడ్డి కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. శనివారం ఆయన పరిస్థితి విషమంగా మారటంతో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతుండగా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
విజయా సంస్థల్లో 17 సంవత్సరాల అనంతరం తిరిగి సినిమా నిర్మాణాన్ని చేపట్టిన వెంకట్రామిరెడ్డి విజయా పతాకంపై బృందావనం, భైరవదీపం, కృష్ణార్జునయుద్దం చిత్రాలను నిర్మించారు. అనంతరం తమిళనంలో అజిత్ తో వీరం, విజయ్ తో భైరవ, ధనుష్ తో పడికాదవన్, విశాల్ తో తామ్రభరణి చిత్రాలను నిర్మించారు.ఉత్తమ నిర్మాతలను ప్రోత్సహించేందుకు తండ్రి బి.నాగిరెడ్డి పేరిట ప్రతియేటా పురస్కారాలను ఆయన అందిస్తూ వచ్చారు.
కాగా వెంకట్రామిరెడ్డి మృతిపై ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని తెలుపుతున్నారు. సోమవారం ఉదయం నెసపాక్కంలోని విద్యుత్ దహన వాటికలో వెంకట్రామిరెడ్డికి తుదిక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంభ సభ్యులు తెలిపారు.