సీనియర్ నటి గీతాంజలి మృతికి ‘మా’ సంతాపం తెలిపింది. ‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్ మాట్లాడుతూ..‘ ఈరోజు ఇండస్ట్రీ గీతాంజలిగారిలాంటి ఓ పెద్ద దిక్కును కోల్పోయింది. అమ్మ… విజయనిర్మలతోనూ ఆవిడకు మంచి అనుబంధం ఉంది. ఇక నటిగా ఆవిడ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాది భాషల్లోనే కాదు…. హిందీలోనూ నటించారు. నటిగానే కాకుండా, వ్యక్తిగతంగానూ గీతాంజలిగారు ఎప్పుడూ సంతోషంగా, అందరితో కలివిడిగా ఉండేవారు. అలాంటావిడ ఉన్నట్లుండి ఇలా అందరినీ వదిలేసి వెళ్లిపోతారని అనుకోలేదు.
ముఖ్యంగా మా ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో అందరికీ ఆమె ఎంతో చేరువగా ఉండేవారు. మంచి, చెడుల్లో భాగమైయ్యేవారు. అలాంటి మంచి మనసున్న వ్యక్తి మనల్ని విడిచిపెట్టిపోవడం బాధాకరం. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.’ అని అన్నారు. మరోవైపు నందినగర్‌లోని గీతాంజలి నివాసానికి టాలీవుడ్ నటులు క్యూ కట్టారు. ఆమె భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తూ… గీతాంజలితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
గీతాంజలికి ‘మా’ ఘన నివాళి
ఐదు దశాబ్దాలకు పైగా దక్షిణ భారత చలన చిత్ర సీమలో 300కు పైగా చిత్రాలలో నటించి హీరోయిన్‌గా, హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన ముద్రను వేశారు గీతాంజలి. నటిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఎంతోకాలంగా సేవలందిస్తున్నారు. ఆమె మృతి చిత్రసీమకే కాకుండా, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు తీరని లోటు అని అసోసియేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి జీవిత, ఇతర కార్యవర్గ సభ్యులు తెలిపారు. గీతాంజలి మృతికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ, ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.