బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్‌లో అఖిల్ అక్కినేని, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. దసరా సందర్భంగా బాక్సాఫీస్ ముందుకొచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఆకట్టుకోవడంతో సినిమాకి కావాల్సినంత ప్రచారం దక్కింది. దీంతో సినీప్రియులు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. మరి ఆ అంచనాలను అఖిల్, పూజాల జోడీ అందుకుందా? ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేర మెప్పించిందో చూద్దాం.
కథ: వైవాహిక జీవితం బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్ష (అఖిల్ అక్కినేని). అందుకు తగ్గట్లే అమెరికాలో మంచి ఉద్యోగం చేస్తూ.. మ్యారేజ్ లైఫ్ కోసం ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. తనపై తనకు ఉన్న నమ్మకంతో పెళ్లికి ముందే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని, అనుకున్న తేదీ కల్లా ఓ మంచి అమ్మాయిని వెతికి పట్టుకునేందుకు రంగంలోకి దిగుతాడు. 20మంది అమ్మాయిల్ని పెళ్లిచూపులు చూసి.. వాళ్లలో మనసుకు నచ్చిన ఆమెతో ఏడడుగులు వేయాలన్నది తన ప్రణాళిక. తనలా పెళ్లిచూపులు చూడాలనుకున్న అమ్మాయిల్లో స్టాండప్ కమెడియన్ విభా అలియాస్ విభావరి (పూజా హెగ్డే) ఉంటుంది.
హర్షలాగే ఆమెకీ పెళ్లి విషయంలో.. రాబోయే జీవిత భాగస్వామి విషయంలో కొన్ని అంచనాలుంటాయి. అయితే ఆమెను పెళ్లి చూపులు చూడకముందే జాతకాలు కలవలేదన్న ఉద్దేశంతో హర్ష కుటుంబం.. ఆ సంబంధం కాదనుకుంటుంది. కానీ, హర్ష మాత్రం విభాను చూసి తొలిచూపులోనే మనసు పారేసుకుంటాడు. ఆమెతోనే పెళ్లి పీటలెక్కాలని కలలు కంటాడు. అయితే విభా మాత్రం హర్ష ప్రేమకు నో చెబుతుంది. ఈ క్రమంలో పెళ్లి విషయంలో ఆమె అడిగిన కొన్ని ప్రశ్నలు.. హర్ష జీవితంలో పెను మార్పులకు కారణమవుతాయి. మరి ఆ ప్రశ్నలేంటి? వాటికి సమాధానం కనుక్కునే క్రమంలో హర్ష తెలుసుకున్న జీవిత సత్యమేంటి? చివరికి తాను అనుకున్నట్లుగా విభా ప్రేమని దక్కించుకున్నాడా? ఆమెతో పెళ్లి పీటలెక్కాడా? లేదా? అన్నది తెరపై చూడాలి.
నటీనటులు: అఖిల్, పూజా హెగ్డే.. తమ తమ పాత్రల్లో ఎంతో చక్కగా ఒదిగిపోయారు. ముఖ్యంగా పూజా తన గ్లామర్‌తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. రొమాంటిక్ సన్నివేశాల్లో అఖిల్, పూజాల జోడీ ఎంతో చూడముచ్చటగా కనిపించింది. మురళీ శర్మ, ఆమని, జయప్రకాష్ పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. ప్రధమార్ధంలో సుడిగాలి సుధీర్.. పోసాని కృష్ణమురళి, ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ తమవంతు నవ్వించే ప్రయత్నం చేశారు. ఈషా రెబ్బా, ఫరియా అబ్దుల్లా, నేహా శెట్టి వంటి హీరోహీరోయిన్‌లను అతిథి పాత్రల్లో ఉపయోగించుకున్న తీరు బాగుంది.
విశ్లేషణ: ప్రేమకథలు సరికొత్త కోణంలో తెరపై ఆవిష్కరించడంలో దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ది అందెవేసిన చేయి. ఆయన చిత్రాల్లో ప్రేమకథలన్నీ చిన్న లైన్‌తోనే ముడిపడి ఉంటాయి. కానీ, ఆ పాయింట్‌ను ఆయన సరికొత్త ట్రీట్‌మెంట్‌తో చెప్పే తీరు సినీప్రియుల్ని మెప్పిస్తుంటుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నూ అలాంటి ఓ చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న ఓ ఆసక్తికర కథాంశంతోనే రూపొందించారు భాస్కర్. అయితే అది మరీ సినిమాటిక్‌గా అనిపించినా.. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఆరంభంలో హర్ష పాత్రని పరిచయం చేసిన తీరు.. అతని కోణం నుంచి కథలోకి తీసుకెళ్లిన విధానం చాలా సింపుల్‌గా అనిపిస్తాయి. ముందే పెళ్లికి ముహూర్తం పెట్టుకుని.. ఆ ముహూర్తం కల్లా పెళ్లి కూతురును సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం.. ఇందుకోసం వరుసగా పెళ్లి చూపులకు వెళ్లడం.. ఈ క్రమంలో ఒకొక్కరి నుంచి అతనికెదురయ్యే అనుభవాలతో కథనం సరదా సరదాగా సాగిపోతుంటుంది. విభా పాత్ర సీన్‌లోకి వచ్చాక కథలో వేగం పెరుగుతుంది. ఆమె పరిచయం అయ్యాక.. హర్షతో వచ్చే ఎపిసోడ్లు.. పెళ్లికి కావాల్సిన అర్హతలేంటి? అంటూ ఆమె వేసే ప్రశ్నలు.. ఆ ప్రశ్నలకు సమాధానం రాబట్టే క్రమంలో అతను పడే ఇబ్బందులు ఆసక్తికరంగా సాగుతూనే నవ్వులు పూయిస్తుంటాయి. విరామానికి ముందు వచ్చే కోర్టు సీన్ లాజిక్‌కు దూరంగా అనిపించినా.. ఆ ఎపిసోడ్‌లో పోసాని కృష్ణ మురళి చేసే హంగామా మంచి కాలక్షేపాన్ని అందిస్తుంది. ఇక విరామ సమయానికి విభాకు హర్ష దూరం కావాల్సి రావడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందా? అన్న ఆసక్తి కలుగుతుంది.
అయితే ప్రధమార్ధంలో ఉన్న మెరుపు సెకండాఫ్ ఆరంభం నుంచే తగ్గినట్లు అనిపిస్తుంది. పెళ్లికి అసలైన ఎలిజిబులిటి ఏంటి? అన్నది చెప్పడం కోసం ద్వితీయార్ధంలో భాస్కర్ రాసుకున్న కొన్ని ఎపిసోడ్లు బలవంతంగా ఇరికించినట్లుగా ఉంటాయి. విభా ప్రశ్నలకు సమాధానం కనుక్కునే క్రమంలో హర్ష తనని తాను తెలుసుకోవడం.. ఆమెని తన ప్రేమతో మెప్పించడం కోసం అతను చేసే ప్రయత్నాలు ఆకట్టుకునేలా సాగుతాయి. అయితే ప్రేమకి.. రొమాన్స్‌కి మధ్య తేడాని సరైన రీతిలో వివరించి చెప్పడంలో ఆఖర్లో భాస్కర్ కాసత తడబడ్డాడు. క్లైమాక్స్‌లో విభా, హర్ష చెప్పే సంభాషణలు మనసులకు హత్తుకుంటాయి. అయితే ఈ ముగింపు చూసిన ప్రతి ఒక్కరికీ ‘బొమ్మరిల్లు’ చిత్రమే మదిలో మెదులుతుంది.
టైటిల్ : మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
నటీనటులు : అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, గెటప్ శ్రీను, మురళీ శర్మ, తదితరులు
నిర్మాతలు : బన్నీ వాసు, వాసు వర్మ
దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్
సంగీతం : గోపీ సుందర్
హైలైట్స్: అఖిల్, పూజా హెగ్డే
డ్రాబ్యాక్స్: సెకండాఫ్
చివరిగా: ఓ మాదిరిగా అలరించే ‘బ్యాచ్‌లర్’
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)