బిగ్‌బాస్-3 రియాల్టీ షోను రోజుకో వివాదం చుట్టుముడుతోంది. బిగ్‌బాస్ నిర్వాహకులపై యాంకర్ శ్వేతారెడ్డి, గాయత్రి గుప్తా బంజారాహిల్స్, రాయదుర్గం పీఎస్‌లలో ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ బిగ్‌బాస్ నిర్వాహకుల వల్ల తాము ఆర్థికంగా నష్టపోయామని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివాదాల సుండిగుండంగా మారిన బిగ్ బాస్ సీజన్ 3 నాగార్జున హోస్ట్‌గా ఈ నెల 21న ప్రారంభం కాబోతుంది.
బిగ్ బాస్ రియాలిటీ షో అంటేనే వివాదాలతో కూడుకున్నది. వివాదం అనే కాన్సెప్ట్‌ను బేస్ చేసుకుని రూపొందించిన ఈ షో ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లో కూడా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఒక్కొక్కరుగా బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీస్ కేసులు పెడుతున్నారు. గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులకు చేరువైన బిగ్ బాస్ మూడో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
రియాల్టీ షో బిగ్‌బాస్-3 అగ్రిమెంట్‌లో భాగంగా చాలా మందికి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందట. వీరిలో ప్రముఖ యాంకర్ శ్వేతా రెడ్డి, వివాదాస్పద నటి గాయిత్రి గుప్తా ఉన్నారు. వీరిని బిగ్ బాస్ షోకోసం సెలెక్ట్ చేసి చివరి నిమిషంలో తమతో అసభ్యంగా ప్రవర్తించారని, వీరిని బిగ్‌బాస్ షో నుంచి తప్పించారంటూ బిగ్ బాస్ నిర్వాహకులపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి వీరిద్దరూ వార్తల్లో నిలిచారు. ఇది బిగ్ బాస్ యూనిట్‌లోని నలుగురిపై పోలీసు కేసులు నమోదు చేసేవరకూ వెళ్లింది.
బిగ్‌బాస్ సీజన్-1లో అనుభవం ఉన్న కత్తి మహేష్ ఈ వివాదంపై స్పందించారు. ముఖ్యంగా గాయిత్రి గుప్తా చేసిన ఆరోపణలపై కౌంటర్ వేశారు. బిగ్ బాస్ హౌస్‌కి వస్తే.. 100 రోజుల పాటు సెక్స్ లేకుండా ఉండగలరా? అని నిర్వాహకులు అడగడంలో తప్పేం ఉందన్నారు కత్తి మహేష్. ఇదే ప్రశ్న అప్పట్లో తనను అడిగారని, ఇదే టీం యాక్టివ్ సెక్స్ లైఫ్ ఉన్న బోల్డ్ అమ్మాయిని ఇప్పడు అడిగితే తప్పైపోతుందా? జస్ట్ ఆస్కింగ్! అంటూ గాయత్రి గుప్తాను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు కత్తి మహేష్.
బిగ్ బాస్ నిర్వాహకులపై గాయత్రి గుప్తా రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రఘు, రవికాంత్ అనే ఇద్దరు కార్యక్రమ నిర్వాహకులు ఇటీవల తనను కలిసి బిగ్‌బాస్ షోలో అవకాశం కల్పిస్తానని చెప్పి అసభ్యంగా ప్రవర్తించారని 100 రోజుల పాటు సెక్స్ లేకుండా బిగ్ బాస్‌లో ఉంటావా? అని అడిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 100 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు ఒప్పుకోవద్దని బిగ్‌బాస్ సీజన్ 3లో సెలెక్ట్ అయినట్టుగా తనతో ముందు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారని, అనంతరం బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తి చేస్తారని అసభ్యకరరీతిలో మాట్లాడారని గాయత్రి గుప్తా ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక బిగ్ బాస్ హౌస్‌కి వెళ్తున్నాననుకున్న సందర్భంలో మీరు బిగ్ బాస్‌కి సెలెక్ట్ కాలేదంటూ తనను మోసం చేశారని వారిపై చర్యలు తీసుకోవాలంటూ గాయిత్రి గుప్తా పోలీసులను కోరారు. బిగ్ బాస్‌లో ఆఫర్ వచ్చిందనే కారణంతో తనకు వచ్చిన ఆరు సినిమా ఛాన్స్‌లు కూడా వదిలేశానని.. ఇప్పుడు తనను బిగ్ బాస్‌కి సెలెక్ట్ చేయకుండా అన్యాయం చేశారని, ఆర్థికంగా నష్టపోయానని ఇందుకు నష్టపరిహారం చెల్లించాలని బిగ్‌బాస్ నిర్వాహకులను కోరానని తెలిపారు. వారు స్పందించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గాయిత్రి గుప్తా వెల్లడించారు.