‘జనతాగ్యారేజ్’, ‘మన్యం పులి’ సినిమాలతో తెలుగులోనూ అభిమానులను సాధించుకున్నారు సూపర్ స్టార్ మోహన్ లాల్. ఆయన హీరోగా ఏ సినిమా వస్తోంది అన్న క్యూరియాసిటీ తెలుగు ప్రేక్షకుల్లో కాస్త ఎక్కువగానే ఉంది. ఆయన నుండి వస్తోన్న మరో సినిమా ‘బ్లాక్‌మనీ’. ‘అన్నీ కొత్త నోట్లే’ అన్నది ఉపశీర్షిక. నిజామ్ సమర్పణలో మాజిన్ మూవీమేకర్స్ పతాకంపై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెలలోనే సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత నిజాముద్దీన్ మాట్లాడుతూ.. ”మోహన్‌లాల్ నటించిన ఈ క్రేజీ సినిమాకి ప్రస్తుతం అనువాదం జరుగుతోంది. వెన్నెలకంటి సంభాషణలు అందించారు. ఇప్పటికే సెన్సార్ పనులు సాగుతున్న ఈ చిత్రాన్ని ఈనెలలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సీనియర్ దర్శకుడు జోషి ఈ సినిమాని అద్భుతమైన గ్రిప్‌తో తెరకెక్కించారు. డీమానిటైజేషన్ తర్వాత అన్నిచోట్లా బ్లాక్‌మనీ గురించే చర్చ సాగుతోంది. ఎప్పటికప్పుడు నల్లదొరలు కొత్త కరెన్సీతో అడ్డంగా దొరికిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజవుతోంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందన్న నమ్మకం ఉంది” అన్నారు.