మా నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించారు. మా సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు మాట్లాడుతూ ‘మా’ అనేది కళాకారుల వేదిక… ఇక్కడ రాజకీయాలకు తావుండకూడదు అని అన్నారు. మా ఎన్నికల సమయంలో మేము అంతమంది ఉన్నాం, ఇంతమంది ఉన్నామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారని, అలాంటి బెదిరింపులకు కళాకారులు ఎవరూ భయపడలేదని మోహన్‌బాబు అన్నారు. మా ఓటు మా ఇష్టం అంటూ నా బిడ్డకు ఓటేసి గెలిపించారంటే
ఏమిచ్చి రుణం తీర్చుకోను నా బిడ్డకు మీరే దేవుళ్లు అన్నారు మోహన్‌బాబు.
నాకు పగ, రాగద్వేషాలు లేవు. నాకు అవసరం లేదు కూడా.. నాకు వయసు పైబడుతోంది అన్నారు. ఓటు వేయని వారిమీదా పగ వద్దు. ఇటువైపు, అటువైపు వద్దు.. అది మనిషిని సర్వనాశనం చేస్తుంది అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టపడి పనిచేశారు.
అందరం కలిసిమెలిసి ఉందాం నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. ఈ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ భారతదేశం గర్వించదగినటువంటి గొప్ప ఖ్యాతి తీసుకురావాలి అని ఆకాంక్షించారు.
నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాను.. అలా మాట్లాడేవారిని తప్పుపడతారని మా గురువుగారు చెప్పారు. అన్న ఎన్టీఆర్ హృదయంలో ఏదీ దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వ్యక్తి ఆయన అన్నారు. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు. నటుల గురించి మాట్లాడుకుందాం.. ఒకరి దయా దాక్షిణ్యాలతో సినిమా ఇండస్ట్రీలో ఉండలేరు, కేవలం టాలెంట్‌తోనే ఇక్కడ కొనసాగుతారని అన్నారు. నువ్వు గొప్పా.. నేను గొప్పా అనేది ముఖ్యం కాదని అన్నారు. జీవితంలో ఎంత కష్టపడినా జయాపజయాలు దైవాదీనం అన్నారు.
కళాకారులకు ఇళ్ల కోసం త్వరలో మీ అందరి తరపున నేను వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుస్తానని మోహన్ బాబు అన్నారు. మాలో సభ్యులకు ఎవరికైనా సమస్య వస్తే అధ్యక్షుడితో చెప్పి సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఇంతకు ముందు జరిగినట్టుగా రోడ్డుకు, టీవీలకు ఎక్కొద్దు అన్నారు.
అన్నదమ్ములు టీవీలకు ఎక్కినట్టు ఉంటుందని అన్నారు. సభ్యులు అందరూ సైలెంట్‌గా ఉండి మీరు అనుకున్నది సాధించడానికి విష్ణును వెనకుండిముందుకు తోయాలని అన్నారు.