సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీని పెట్టడాన్నిరజనీకాంత్ విరమించుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన తెలిపారు. దీంతో, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. తాజాగా దీనిపై రజనీకాంతత్ ఫ్రెండ్ డైలాగ్ కింగ్ మోహన్ బాబు స్పందించాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా తన మిత్రుడికి మద్దతుగా మోహన్ బాబు అందరికీ బహిరంగ విన్నపం చేశారు.
‘రజనీకాంత్ నాకు అత్యంత ఆత్మీయుడు అన్న సంగతి మీకందరికీ తెలుసు. తన ఆరోగ్యరీత్యా రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించారు. ఒక రకంగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మీకు, అభిమానులందరికీ బాధే అయినప్పటికీ… ఒక స్నేహితుడిగా తన ఆరోగ్యం గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా తను రాజకీయాల్లోకి రాకపోవడం మంచిదని నమ్ముతున్నారు. నా మిత్రుడితో ఎన్నో సందర్భాల్లో చెప్పాను. నువ్వు చాలా మంచివాడివి, చీమకు కూడా హాని చేయనివాడిని, నా దృష్టిలో గొప్ప వ్యక్తులలో ఒకడివి. నీలాంటి వ్యక్తికి, నాలాంటి వ్యక్తికి రాజకీయాలు పనికిరావు. ఎందుకంటే, మనం ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడతాం. ఎవరికీ ద్రోహం చెయ్యం. డబ్బులిచ్చి ఓట్లు, సీట్లు కొనలేము. కొనము కూడా. ఇక్కడ ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. రాజకీయాల్లోకి రానంత వరకు మంచివాడివి అన్న నోళ్లే, రేపు వచ్చాక చెడ్డవాడివి అంటాయి.
రాజకీయం ఒక రొచ్చు, ఒక బురద. ఆ బురద అంటుకోకుండా నువ్వు రాకపోవడమే మంచిది అయ్యింది. రజనీకాంత్ అభిమానులందరూ ఆయన అంత మంచి వాళ్లు. మీరందరూ సహృదయంతో నా మిత్రుడి నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను’ అని మోహన్ బాబు కోరారు. దీంతో పాటు తన మిత్రుడితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.