టాలీవుడ్ కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, నట ప్రపూర్ణ పద్మశ్రీ మంచు మోహన్‌బాబు 69వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. తనకు ఎంతో ఇష్టమైన శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను 1992లో తన పుట్టినరోజునే ప్రారంభించారు. 27 ఏళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. ఎంతో మంది పేద విద్యార్థులకు ఫీజు రాయితీ అందిస్తూ వారిని మేధావులుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏటా మోహన్‌బాబు తన పుట్టిన రోజును శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల వార్షికోత్సవ వేడుకలను కలిపి విద్యార్థుల సమక్షంలోనే ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ.
ప్రస్తుత తరుణంలో ప్రపంచమంతటా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్న విషయం తెలిసిందే. దేశమంతటా కరోనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ విధించింది. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సమూహాలుగా ఉండొద్దని, విదేశీ ప్రయాణాలు చేయొద్దని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినియా థియేటర్లు, కల్యాణ మండపాలు, సందర్శన స్థలాలు మూసివేశారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 19న జరగాల్సిన శ్రీ విద్యానికేతన్ పాఠశాల మరియు కళాశాల వార్షికోత్సవాలను వాటితో పాటు తన పుట్టిన రోజు వేడుకలను వాయిదా వేసుకుంటున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు ఇంత దూరం రావొద్దని సహృదయంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ తరలిపోయే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ.. ఈ సందర్బంగా ఓ లేఖను విడుదల చేశారు.