‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తన తనయుడు మంచు విష్ణు ప్యానెల్‌కి ఓటేసి గెలిపించాలని సీనియర్ నటుడు మోహన్ బాబు కోరారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, అదొక బాధ్యత అని అన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా విష్ణు పక్కనే ఉంటాడని తెలిపారు. ఈ మేరకు ఓ లేఖని విడుదల చేశారు.
‘‘నేను మీ అందరిలో ఒకడిని, నటులతో పాటు నటుడ్ని, నిర్మాతలతో పాటు నిర్మాతని, దర్శకత్వ శాఖలో పనిచేసిన వాడ్ని, ఇండస్ట్రీలో కష్టం వచ్చిన ప్రతిసారీ ‘నేనున్నాను’ అని ముందు నిలబడ్డ దివంగత దాసరి నారాయణ గారి అడుగు జాడల్లో నడుస్తున్న ఆయన బిడ్డని. చేసిన సాయం, ఇచ్చిన దానం ఎప్పటికీ ఎవ్వరికీ చెప్పకూడదంటారు. కానీ, చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంస్థని స్థాపించిన రోజు నుంచి, నేటి వరకూ ఎన్నో చిత్రాల్ని నిర్మిస్తూ ఎంతోమంది టెక్నిషియన్లని, కళాకారులని పరిచయం చేశా. 24 క్రాఫ్ట్స్‌లో ఉన్న ఎంతోమంది పిల్లలకి, మరణించిన సినీ కళాకారుల పిల్లలకి మన విద్యాసంస్థల్లో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించి, వాళ్లు గొప్ప స్థాయికి చేరేలా చేశాను, దాన్ని కొనసాగిస్తాను’’
‘‘నేను ‘మా’ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడే వృద్ధాప్య పింఛన్లని ప్రవేశపెట్టా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదు, అదొక బాధ్యత. ఈసారి ఎన్నికల్లో నా కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నాడు. నా బిడ్డ నా క్రమశిక్షణకి, నా కమిట్‌మెంట్‌కి వారసుడు. తను ఇక్కడే ఉంటాడు. ఈ ఊళ్లోనే ఉంటాడు. ఏ సమస్య వచ్చినా మీ పక్కనే ఉంటాడని నేను మాటిస్తున్నా. మీరు మీ ఓటుని విష్ణుతోపాటు పూర్తి ప్యానెల్‌కి వేసి సమర్థవంతమైన పాలనకి సహరించాలని మనవి’ అని మోహన్ బాబు కోరారు. అక్టోబరు 10న ఈ ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు, ప్రకాశ్‌రాజ్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.