మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ అవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకర్షించింది. అంతకుముందు రాజశేఖర్ ప్రవర్తనపై మోహన్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో చాలా మందికి ఏ సాయం కావాలన్న చేసే టీ సుబ్బిరామిరెడ్డి లాంటి పెద్దల సమక్షంలో ఇలా జరగడం బాధకరమన్నారు. అలాగే కార్యక్రమాన్ని ఫన్నీ వేలో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘తాత గారైన కృష్ణంరాజు’ అని చెప్పి.. సభలో నవ్వులు పూయించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు కలగచేసుకుని.. ‘మా’ అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండటమే.. అందరు ఫ్యామిలీలా ఉండాలని పిలుపునిచ్చారు.
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్, శివాజీలు ఒకే వేదికపై కూర్చొని సరదాగా ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకునేవారని మోహన్‌బాబు గుర్తుచేశారు. అలాగే తానూ, చిరంజీవి కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు ఒకరిపై ఒకరు ఛలోక్తులు విసురుకుంటుంటామని చెప్పారు. అది సరదాకే తప్ప తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. చిరంజీవి కుటుంబం నాది.. నా కుటుంబం అతనిది అని అన్నారు. ఈ సమయంలో మోహన్‌బాబు వద్దకు వచ్చిన చిరంజీవి ఆయన బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టారు.
అనంతరం మోహన్‌బాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ… చిరంజీవిని ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. తను భార్యకు భయపడను.. విధేయుడిని అయి ఉంటానని అన్నారు. గతంలో పరిశ్రమ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించిన ఇద్దరు కమెడియన్లను చిరంజీవి పిలిచి మరి హెచ్చరించారని తెలిపారు. సినీ పరిశ్రమ మంచి చెడులపై నలుగురం కూర్చొని మాట్లాడుదామని చిరంజీవి అన్నారని.. కానీ తాను అందుకు రాలేనని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ తల్లిలాంటిందిని.. దీనిని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.