Mohan Babu: కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ మోహన్‌బాబు సినీ పరిశ్రమలో 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తిచేసుకున్నారు. మోహన్ బాబు నటుడు, నిర్మాత, రాజకీయ వేత్త, విద్యావేత్త.
మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సల నాయుడు. కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు సేవలకు గాను ఆయనను కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబుది ఒక ప్రత్యకమైన స్థానం. తన విలక్షణమైన నటనతో, డైలాగ్ డెలివరీతో దశాబ్దాలుగా ఆయన సినీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
నటుడిగా ఆయన ఈ 48 ఏళ్లలో ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పగా, ఎన్నో అవార్డులను అందుకున్నారు, ఎన్నో ఒడిదుడుకులను, ఎత్తుపల్లాలను చూశారు.
70వ దశకంలో ఆయన నట ప్రస్థానం మొదలవగా ఆరంభంలో అందరికీ ఎదురైనట్టుగానే ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, సవాళ్లు ఎదురయ్యాయి. కొంతకాలం డైరెక్టర్ విభాగంలో పనిచేశారు. ఆయన అకుంఠిత భావం, కష్టపడే తత్త్వం, అంకిత భావంతో ఎదిగారు.
మంచు మోహన్‌బాబు దాదాపు 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించారు. నిర్మాతగా అరుదైన రికార్డులను సైతం సొంతం చేసుకున్నారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, రాయలసీమ రామన్న చౌదరి వంటి చిత్రాలు మోహన్ బాబు ఖాతాలో ఎప్పటికీ చెరిగినిపోని రికార్డులు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రికార్డులు సృష్టించాయి.
మోహన్ బాబు తనదైన స్టైల్లో డైలాగ్స్ చెప్పడం, విలక్షణంగా నటించడం, నవ్వించడం, ఏడిపించడం, విలనిజంలో కొత్తదనం చూపించడంతో అతి కొద్దికాలంలోనే ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.
సినీ పరిశ్రమలో మోహన్‌బాబు 48 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘కన్నప్ప’ చిత్ర బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేసింది.
‘కన్నప్ప’ చిత్రాన్ని మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ చిత్రంలో శివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీదేవి పాత్రలో నయనతార నటిస్తున్నారు. మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్ ఇతర ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.