టాలీవుడ్ డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు 2019 నవంబరు 22 నాటికి చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి నలభై నాలుగు వసంతాలు పూర్తి చేసుకున్నారు. మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెంలో 19 మార్చి 1952న జన్మించారు. తండ్రి మంచు నారాయణస్వామి నాయుడు (ఉపాధ్యాయుడు), తల్లి లక్ష్మమ్మ. భార్య నిర్మలా దేవి. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. మోహన్ బాబు ఏర్పేడులో 5వ తరగతి వరకు చదువుకున్నారు. #MB44 ఆ తర్వాత హైస్కూల్ విద్యాభ్యాసం తిరుపతిలో జరిగింది. ఇంటర్ నుంచి డిగ్రీ వరకు మద్రాసులో చదువుకున్నారు. సినీరంగంలో ప్రవేశించడానికి ముందు మోహన్ బాబు తండ్రి కోరిక మేరకు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1970ల ప్రారంభంలో అర్ధ దశాబ్దంపాటు దర్శకత్వ విభాగంలో కూడా పనిచేశారు.
దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 500 పైగా చిత్రాల్లో నటించారు. లక్ష్మీప్రసన్న బ్యానర్ నెలకొల్పి 70 కి పైగా సినిమాలు నిర్మించారు. ఈయన నిర్మాతగా చేసిన పెదరాయుడు (1995) 475 రోజులు, మేజర్ చంద్రకాంత్ (1993) 270 రోజులు, కలెక్టర్‌గారు (1996) 275 రోజులు, అల్లరి మొగుడు (1992) 200 రోజులు ఆడి రికార్డులు క్రియేట్ చేశాయి. #MB44 మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో అభిమానుల గుండెల్లో కలెక్షన్‌కింగ్‌గా కొలువయ్యాడు.
మోహన్ బాబు ఏ పాత్ర వేసినా అందులో పరకాయ ప్రవేశం చేసి నటనలో జీవిస్తారు. సినీరంగంలోనూ, నిజ జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మోహన్ బాబు వాటిని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదిగారు. ఎన్టీఆర్‌తో మేజర్ చంద్రకాంత్ సినిమా తీశారు. కేవలం సినీరంగానికే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించి తన విద్యాసంస్థ శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నారు. #MB44 మోహన్ బాబు చేసిన సేవలకు గాను 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుంచి శ్రీకృష్ణ దేవరాయల పురస్కారం సొంతం చేసుకున్నారు. సినీరంగంలో ఈయనకు డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ బిరుదులు ఉన్నాయి. యాక్టర్ ఆఫ్ ది మిలీనియం, తెలుగు ఫిలిం ఫేర్ అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు, కళా పరిపూర్ణ, డా.బెజవాడ గోపాల్ రెడ్డి అవార్డు, స్వర్ణ కనకం అవార్డును అందుకున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు మోహన్‌బాబు.
1982లో టీడీపీ స్థాపించినప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. 1995లో మోహన్‌బాబు రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆరేళ్ల పాటు పదవిలో కొనసాగిన మోహన్‌బాబు చిత్తూరు జిల్లా అభివృద్ధి కోసం కృషి చేశారు. మోహన్‌బాబు ముక్కుసూటిగా మాట్లాడతారని ఆయనను విమర్శించే వారు ఎక్కువ. తనకుజన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే సినీ జీవితాన్నిచ్చింది దాసరి నారాయణరావు అని చెబుతారు. #MB44 అందుకే దాసరిని మోహన్‌బాబు గురువుగారు అని పిలుస్తారు. తండ్రి తర్వాత తండ్రి అని చెబుతారు.
మోహన్‌బాబుకు చిన్నప్పటి నుంచి సినిమాలు చేయాలని కోరిక ఉన్నప్పటికీ తండ్రి మాట కాదనలేక ఉపాధ్యాయుడిగా పనిచేశారు. కొంతకాలం ఉద్యోగం చేసిన తర్వాత సినిమాల్లోకి వెళ్లాలన్న లక్ష్యం మరింత పెరిగింది. తండ్రిని ఒప్పించి టిక్కెట్టు లేకుండా రైలెక్కి మద్రాసు వెళ్లిపోయారని చెబుతారు. అక్కడ సినీ అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడిన మోహన్‌బాబు ముందుగా ఓ డైరెక్టర్ వద్ద అసిస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. #MB44 కొంతకాలం అక్కడ పనిచేశాక దాసరి నారాయణరావు పరిచయం కావడంతో 1975లో దాసరి దర్శకత్వం వహించిన స్వర్గం-నరకం చిత్రంలో మోహన్‌బాబుకు సినిమా అవకాశం దక్కింది. ఆ చిత్రంతోనే భక్తవత్సలం నాయుడు నుంచి మోహన్‌బాబుగా పేరు మార్చారు దాసరి. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినీ హీరోగా ఉన్నత శిఖరాలను అందుకున్నారు మోహన్‌బాబు.
ఎప్పటికైనా రావణ బ్రహ్మ పాత్రలో నటించాలని ఆయన కోరిక. ఆయన ఆశయం నెరవేరాలని, మోహన్ బాబు ఆయుఆరోగ్యలతో తన కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుందాం.