అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీమసీదు భూమివాద స్థలంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ తీర్పు ఏ ఒక్కరికీ విజయంగానీ.. ఓటమిగానీ కాదని పునరుద్ఘాటించారు. ”అయోధ్యపై సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు వెలువరించింది. ఈ తీర్పుని ఏ ఒక్కరికీ విజయంగాగానీ, ఓటమిగాగానీ భావించరాదు. రామభక్తి అయినా.. రహీమ్‌భక్తి అయినా ఇకపై భారతభక్తిని బలోపేతం చేయాల్సిన సమయం ఇది. ఈ సందర్భంగా దేశవాసులంతా శాంతి, సామరస్యాల్ని పరిరక్షిస్తూ.. భారతదేశ ఏకత్వాన్ని చాటాలి. నేడు వెలువరించిన సుప్రీం కోర్టు తీర్పు అనేక రకాలుగా ప్రాముఖ్యమైనది. ఎలాంటి వివాదమైనా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించవచ్చునని నిరూపితమైంది. అలాగే ఈ తీర్పు భారత న్యాయవ్యవస్థ స్వతంత్రత, పారదర్శకత, దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. చట్టం ముందు అందరూ సమానులేనని ఈ తీర్పు మరోసారి చాటి చెప్పింది. దశాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్యన్నిన్యాయస్థానం అందిరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించింది. ఈ కేసులో ప్రతి వర్గానికి తగు సమయం కేటాయించారు. భిన్న వాదనలు, అభిప్రాయాలకు చోటుకల్పించారు. దీంతో న్యాయవ్యవస్థపై ప్రజలకున్న విశ్వాసం మరింత పెరుగుతుంది. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 130కోట్ల మంది ప్రజలు పాటిస్తున్న సంయమనం.. శాంతి కోసం ప్రజలు కట్టుబడి ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలి” అని అయోధ్య తీర్పుపై ట్విటర్ వేదికగా మోడీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూసిన అయోధ్య స్థల వివాద కేసులో సుప్రీం కోర్టు నేడు చరిత్రాత్మక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద స్థలాన్ని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం అభిప్రాయపడింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకు అప్పగించాలని పేర్కొంది. ఆ స్థలంలో ఆలయం నిర్మించాలని స్పష్టం చేసింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని కోర్టు నిర్ణయించింది. ఇందుకోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5ఎకరాల స్థలం కేటాయించాలని ధర్మాసనం ఆదేశించింది.