Homeతెలుగు News16వ లోక్ సభలో మోడీ..చివరి ప్రసంగం

16వ లోక్ సభలో మోడీ..చివరి ప్రసంగం

13 6సార్వత్రిక ఎన్నికలకు ముందు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 16వ లోక్ సభలో చివరిసారిగా ప్రసంగించారు. ప్రసంగంలో తన ప్రభుత్వ పనితీరుని వివరిస్తూనే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై పలుమార్లు సెటైర్లు వేశారు. మొదటిసారి ఎంపీ అయిన తనకు కౌగిలికి, మెడకు తగులుకోవడానికి తేడా పార్లమెంటులోనే తెలిసొచ్చిందన్నారు ప్రధాని మోడీ. గత ఏడాది జూలైలో రాహుల్ గాంధీ ప్రధానిని లోక్ సభలో కౌగిలించుకోడాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. ‘నాకు గలే మిల్నా (కౌగిలించుకోవడం) గలే పడ్నా (మెడకు తగులుకోవడం)కి తేడా తెలిసింది. నాకు ఆంఖో కీ గుస్తాఖియా (కంటి కొంటె చేష్టల) అర్థం తెలిసింది’ అన్నారు.

గత ఏడాది లోక్ సభలో చర్చ సందర్భంగా బీజేపీ తనను ద్వేషించినా తనకు ప్రధానిపై ఎలాంటి ఏహ్యభావం లేదని రాహుల్ గాంధీ మోడీకి చెప్పారు. ‘మీరు నన్ను ద్వేషిస్తారు. నేను మీకు పప్పు కావచ్చు. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. గౌరవిస్తున్నాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాదినని’ చెబుతూ రాహుల్ ప్రధానమంత్రి దగ్గరకు నడచుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నారు. రాఫెల్ ఫైటర్ జెట్ డీల్ పై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ ను ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ‘ఈ సభలో ఎన్నో విమానాలు ఎగరేశారు’ అన్నారు. బుధవారం పార్లమెంటులో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) రిపోర్ట్ ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్ నుంచి మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనుగోలు చేసిన 36 రాఫెల్ ఫైటర్స్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం బేరమాడిన ధరల కంటే 2.86% చౌకైనవని నివేదిక తేల్చి చెప్పింది.

రాహుల్ గాంధీపై తన దాడిని కొనసాగిస్తూ ప్రధానమంత్రి ‘ఏదో భూకంపం వస్తుందని చర్చ జరిగింది. కానీ అది రాలేదు’ అన్నారు. పార్లమెంట్ లో ప్రభుత్వం తనను మాట్లాడనివ్వడం లేదని తనకు మాట్లాడే అవకాశం వస్తే భూకంపం వస్తుందన్న రాహుల్ గాంధీ మాటలను ఎద్దేవా చేశారు.సుమారుగా 219 బిల్లులు తెస్తే వాటిలో 203 బిల్లులు ఆమోదం పొందాయని ప్రధాని తెలిపారు. నల్లధనం, అవినీతిపై కఠిన చట్టాలను తెచ్చాం. బినామీ, దివాలా, ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వాళ్ల కోసం చట్టాన్ని ఇదే సభలో చేశామన్నారు. 16వ లోక్ సభను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని చెప్పారు. క్రెడిట్ కోసం పాకులాడకుండా మాజీ ఆర్థిక మంత్రి, అప్పటి రాష్ట్రపతితో రాత్రి 12 గంటలకు సంయుక్త సమావేశాలు జరిపి జీఎస్టీని అమల్లోకి తెచ్చామన్నారు. సామాజిక న్యాయం కోసం ఉన్నత వర్గాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ తెచ్చామని గుర్తు చేసుకున్నారు.

గత 30 ఏళ్లలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడిందని మోడీ చెప్పారు. ఇవాళ భారత్ ఆత్మవిశ్వాసం పెరిగి ఆకాశాన్నంటుతోందన్నారు. ఇవాళ దేశం ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. తన హయాంలో సాధించిన విజయాలకు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ప్రశంసించారు.16వ లోక్ సభలో మొట్టమొదటిసారి మహిళ ఎంపీల భాగస్వామ్యం పెరిగిందన్నారు ప్రధాని. మొదటిసారి 44 మంది మహిళలు ఎంపీలయ్యారని అందరూ సభకు తగిన హాజరు నమోదు చేశారని తెలిపారు. మొదటిసారి స్పీకర్, రిజిస్ట్రార్ జనరల్, సెక్యూరిటీ జనరల్, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu