Kamal Haasan: తమిళనాడు సీఎం.. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఈరోజు ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయం అధ్యక్షుడు కమల్ హాసన్ భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చే అంశంపై వీరిద్దరూ చర్చలు జరిపారు. 2025 రాజ్యసభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం పార్టీకి ఒక రాజ్యసభ స్థానం ఇచ్చేందుకు డీఎంకే నేతృత్వంలోని కూటమి అంగీకరించింది.
ఈ సమావేశం అనంతరం కమల్‌హాసన్ మీడియాతో మాట్లాడుతూ.. ”నాకు ఎలాంటి పదవులు వద్దు. దేశ ప్రయోజనాలను కాంక్షించి కూటమిలో చేరా. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయడం లేదు. డీఎంకే-కాంగ్రెస్ కూటమికే పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా” అని వెల్లడించారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులోని 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలోని ఒక స్థానంలో కూటమి తరఫున ఎంఎన్‌ఎం పార్టీ ప్రచారం చేయనుంది.
ఇక, ఈ సాయంత్రం డీఎంకే, కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. దీని తర్వాత రాష్ట్రంలో విపక్ష ఇండియా కూటమి పార్టీల సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటక చేయనున్నారు. ఒప్పందంలో భాగంగా తమిళనాడులో కాంగ్రెస్‌కు 10 సీట్లు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సీపీఐ, సీపీఎంలకు రెండు చొప్పున స్థానాలను ఇవ్వనున్నట్లు సమాచారం.