చందానగర్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లింట చావు బాజ మోగడంతో కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్నారు. ఒక్కటి కానున్న దంపతులు అర్దాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లడంపై ప్రతీ ఒక్కరు కంటతడి పెట్టారు.
హైదరాబాద్ సమీపంలోని చందానగర్ పాపిరెడ్డినగర్‌కు చెందిన సోని, మనోహర్‌కి ఇటీవలే నిశ్చితార్థం అయ్యింది. ఫిబ్రవరిలో వారికి వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. షాపింగ్ కోసం బయల్దేరిన వారు అనంత లోకాలకు వెళ్లిపోయారు. వారు ఇంటి నుంచి అండర్ పాస్ ద్వారా రావాలి.. దారి బాగోలేదని రైల్వే ట్రాక్ మీదుగా వెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోనే మృత్యువు వారిని కబళించింది. ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా వారి మీదినుంచి వెళ్లిపోయింది. వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. షాపింగ్ కోసం బయల్దేరిన సోని, మనోహర్ విగతజీవులుగా మారారు. అండర్ పాస్ పనులు పూర్తికాకపోవడంతోనే తొందరగా వెళ్లే ప్రయత్నంలో దుర్ఘటన జరిగిందని స్థానికులు అంటున్నారు. అండర్ పాస్ పూర్తయితే సమస్య తలెత్తకపోయేదన్నారు. సోని, మనోహర్ మృతికి కారణం అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికుల ఆరోపణ. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలను ఆరాతీస్తున్నారు.