టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎమ్మెల్సీ పోతుల సునీత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శాసన మండలిలో జరిగిన పరిణామాలు విచారకరమని, మండలి చట్టానికి విరుద్ధంగా ముందుకు సాగిందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని పోతుల సునీత ఆరోపించారు. రాజకీయ ధోరణితో మండలిలో 3 రాజధానుల బిల్లును అడ్డుకున్నారని తెలిపారు. రాజకీయ అజెండాతోనే మండలిని దిగజార్చారని అన్నారు. అసెంబ్లీ అనుకునేది ఫైనల్ అని తెలిసినా బిల్లును అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు మండలికి వచ్చి గ్యాలరీలో కూర్చుని సైగలు చేశారని, రాజకీయ ఒత్తిడితోనే సభ నడిచిందని ఆమె అన్నారు. కౌన్సిల్ సభ్యురాలిగా నిన్న జరిగిన పరిణామాలపై బాధ కలిగిందని, చట్టాలకు విరుద్ధంగా చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబు తనకు ఏదో సహాయం చేశానని చెప్పడం తగదని అన్నారు. మా కుటుంబం ఎప్పుడు దేనికోసం ఆశపడదని అన్నారు. మూడు ప్రాంతాల అభివృద్ధికే వికేంద్రీకరణ బిల్లు అన్న ఆమె సభ్యులు చంద్రబాబు ట్రాప్‌లో పడకుండా జాగ్రత్తపడాలని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ లు ఇప్పటికైనా టీడీపీని వీడి బయటికి రావాలని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా ఆమె ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్టు తెలిపారు. అయితే సునీతపై అనర్హత వేటు వెయ్యాలని మండలి చైర్మన్ కు టీడీపీ ఫిర్యాదు చేసింది. దీనిపై చైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.