ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల రెండోరోజు సభలో విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికపై అభినందనలు చెబుతూనే పదునైన విమర్శలతో పాలక, ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ సందర్భంగా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా.. గత ప్రభుత్వంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తనపై ఏడాదిపాటు స్పీకర్ సస్పెన్షన్ వేటు వేసి అత్యున్నత స్థానాన్ని దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. స్పీకర్ కుర్చీని అవమానించడం, దాన్ని దుర్వినియోగ పరచడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ఇదే మొదటిసారి కాదని, గతంలో కిరణ్‌కుమార్ రెడ్డి స్పీకర్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనను అవమానపరిచిన విషయాన్ని రాష్ట్ర ప్రజలంతా చూశారన్నారు.
కాల్ మనీ, సెక్స్ రాకెట్ వల్ల మహిళలు పడుతున్న బాధల గురించి ప్రశ్నించిన తన గొంతును నొక్కేందుకు స్పీకర్ పదవిని వాడుకున్నారని అన్నారు. ఇక అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తనకు అనుకూలంగా తీర్పు వెలువరించినా… తనను సభలోకి రాకుండా అడ్డుకున్నారని.. అలాంటి వాళ్లు విలువల గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మండిపడ్డారు. ఇక తమ జిల్లా వాసి స్పీకర్ అయితే సంతోషకంటే బాధనే ఎక్కువగా ఉన్నట్టుగా అచ్చెన్నాయుడు వ్యాఖ్యలున్నాయని సెటైర్లు వేసిన రోజా… సభాపతి స్థానం తండ్రి స్థానం లాంటిదని, తండ్రి తన పిల్లలందరినీ ఎలా సమానంగా చూస్తారో.. అలాగే సభ్యులందరినీ సమానంగా చూడాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు, ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన స్థాపించిన పార్టీని తీసుకుని.. అసెంబ్లీలో మాట్లాడకుండా చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు రోజా.. ఐదేళ్లు విపక్షాన్ని ఇబ్బంది పెట్టిన టీడీపీ నేతలకు… రెండు రోజులకే అంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేత అయిన చంద్రబాబు… స్పీకర్ ఎన్నికలో హుందాతనంగా వ్యవహరించవచ్చు కదా? అని ప్రశ్నించారు రోజా.