ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నాయకుడు మిథున్ చక్రవర్తి అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం ఛాతీ నొప్పితో బాధపడిన ఆయన కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో జయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండె నొప్పి రావడంతో.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిథున్ చక్రవర్తికి ఇటీవలే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. బెంగాలీ కుటుంబానికి చెందిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్, బెంగాలీ సినిమాల్లో హీరోగా నటించారు. 100కి పైగా చిత్రాల్లో నటించిన ఆయన చివరిసారిగా బెంగాలీ చిత్రం ‘కాబూలీవాలా’లో నటించారు.
‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలోనూ నటుడిగా ఆయన తన సత్తా చాటారు. అతిలోక సుందరి శ్రీదేవి సరసన అనేక చిత్రాల్లో నటించిన ఆయన తెలుగులో ‘గోపాల గోపాల’ సినిమాలో నటించారు. బాలీవుడ్‌లో తనకంటూ సొంత ఇమేజ్ సాధించిన మిథున్ చక్రవర్తి.. రాజకీయాల్లోనూ ప్రవేశించి రాజ్యసభకు వెళ్లారు. టీఎంసీ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు.
మిథున్ చక్రవర్తి గతంలో కిడ్నీ సమస్యతో బాధపడ్డారు. రెండేళ్ల క్రితం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో ఆయనకు ఆపరేషన్ జరిగింది. మళ్లీ ఇప్పుడు ఛాతీ వద్ద నొప్పి రావడంతో.. కోల్‌కతాలోని ఆపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.