నటీనటులు: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్, రఘుబాబు, నాజర్ తదితరులు
సంగీతం: మిక్కీ జె మేయర్
సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్
నిర్మాతలు: నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
దర్శకత్వం: శ్రీనువైట్ల
వరుణ్ తేజ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ‘మిస్టర్’. కమర్షియల్ హీరో అనిపించుకోవడానికి వరుణ్ తేజ్ ఈ సినిమా ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ శ్రీనువైట్ల ఈ సినిమాతో సక్సెస్ అందుకోవాలని ఆశ పడుతున్నాడు. మరి వీరి ఆశించినట్లుగా విజయం దక్కిందో లేదో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
చెయ్(వరుణ్ తేజ్) తన ఫ్యామిలీతో కలిసి స్పెయిన్ లో జీవిస్తుంటాడు. ఒకరోజు ఎయిర్ పోర్ట్ లో మీరా(హెబ్బా పటేల్)అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తనను ప్రేమలో దింపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే మీరా వేరెవరినో ఇష్టపడుతుందని తెలుసుకొని తప్పుకుంటాడు. ఇండియాకు వెళ్ళిన మీరా తన ప్రేమ సమస్యలో పడిందని చెయ్ కు చెబుతుంది. దీంతో చెయ్ ఇండియా బయలుదేరతాడు. అక్కడ చెయ్ కు చంద్రముఖి(లావణ్యత్రిపాఠి) అనే అమ్మాయికనిపిస్తుంది. తను ఏదో సమస్యలో ఉందని గ్రహించిన చెయ్ తనకు కూడా సహాయం చేయాలనుకుంటాడు. మరి చెయ్ అనుకున్నట్లుగా మీరా ప్రేమను గెలిపించాడా..? ఇంతకీ చంద్రముఖి స్టోరీ ఏంటి..? మీరా, చంద్రముఖిలలో చెయ్ ఎవరిని పెళ్లి చేసుకుంటాడు..? అనే విషయాలతో సినిమా నడుస్తుంది.
ప్లస్ పాయింట్స్:
సినిమాటోగ్రఫీ
యాక్షన్ ఎపిసోడ్స్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
ఎడిటింగ్
సంగీతం
విశ్లేషణ:
రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలను పక్కన పెట్టి టాలీవుడ్ లో కొత్తగా సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు తమ సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తుంటే.. మేము ఇంకా మూస ధోరణిలోనే సినిమాలు చేస్తామని రొటీన్ కథా, కథనాలతో సినిమాలు చేసే దర్శకనిర్మాతలు లేకపోలేరు. మిస్టర్ టీం కూడా అదే జాబితాలోకి వస్తుంది. వరుస ఫ్లాప్స్ తో ఉన్న వైట్ల ఈసారి ఖచ్చితంగా కొత్త ఫార్మాట్ లో సినిమా చేస్తాడని నమ్మిన ఆడియన్స్ కు నిరాశే ఎదురైంది. ఈసారి కూడా తన స్క్రీన్ ప్లే తోనే ప్రేక్షకులను ఆడుకున్నాడు.
సినిమాలో చెప్పుకునే విధంగా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకారం. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో కామెడీ సీన్స్, లవ్ సీన్స్ తో నెట్టుకొచ్చాడు. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ మొదలైందో.. సినిమా ఎప్పుడు అయిపోతుందా..? అనే ఫీల్ ప్రేక్షకులకు కలగడం ఖాయం. సినిమా మొత్తం అతికించినట్లుగా ఉంటుంది. ఏదో కామెడీ కోసం కొన్ని ట్రాక్స్ రాసుకోవడం, దాన్ని కథకు లింక్ చేసే ప్రయత్నం చేయడం పెద్దగా వర్కవుట్ కాలేదు.
వరుణ్ తేజ్ తన పాత్ర పరిధిలో ఓకే అనిపించాడు. హెబ్బా, లావణ్య త్రిపాఠి అందంగా కనిపించారు. పృధ్వీ, రఘుబాబులతో చేసిన కామెడీ కొంతమేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఒకరిని టార్గెట్ చేస్తూ కామెడీ చేయడం రుచించలేదు. ఇప్పటికే వైట్ల చాలా వరకు తన సినిమాల్లో ఇటువంటి కామెడీ ట్రాక్స్ చేశాడు. సినిమాటోగ్రఫీ వర్క్ ఆకట్టుకుంది. మ్యూజిక్, ఎడిటింగ్ సినిమాకు మైనస్. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.