గురువారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లోని సంస్థలు, వ్యక్తుల నుంచి కేంద్ర భద్రతా సంస్థలకు శాంతి, భద్రతలకు సంబంధించి పలు సూచనలు అందాయి. పలు ప్రాంతాల్లో హింస చెలరేగే అవకాశం ఉందని సమాచారం అందడంతో ఈ ప్రకటన చేసింది. అన్ని ప్రాంతాల్లో శాంతి, భద్రతలను పరిరక్షించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర నుంచి ఇటువంటి నివేదికలు అందాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు, హింస చెలరేగవచ్చని తమకు సమాచారం అందినట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని కేంద్ర హోం శాఖ సూచించింది. అలాగే, ఈవీఎంలు ఉండే స్ట్రాంగ్ రూముల్లో, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రత కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కాగా, లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 11 నుంచి మే 19 మధ్య దేశంలోని 542 లోక్‌సభ స్థానాలకు గానూ ఏడు దశల్లో జరిగాయి. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది. గురువారం ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.