ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న విడుదల కానుంది. ఇక ఇటీవల ఈ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయమై అదేవిధంగా ప్రివ్యూల విషయమై ముఖ్యమంత్రి జగన్ తో రాజమౌళి మరియు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య భేటీ అయిన సంగతి తెల్సిందే. జగన్ గారు సానుకూలంగా స్పందించారని జక్కన్న చెప్పుకొచ్చాడు. ఇక నేడు ఈ ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల పెంపుపై ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని కీలక ప్రకటన చేశారు. వంద కోట్ల బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ రేట్ల విషయమై ఇటీవల ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి, నిర్మాత దానయ్య.. జగన్ గారిని కలిశారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నిర్మాతలు దరఖాస్తు చేశారు. త్వరలోనే ఆ దరఖాస్తుపై జగన్ సంతకం పెట్టనున్నారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ రెమ్యూనిరేషన్ కాకుండా సినిమా నిర్మాణానికి మాత్రమే వందకోట్ల బడ్జెట్ పెడితే.. ఆ సినిమాలకు సినిమా విడుదలైన 10 రోజులు టికెట్ రేట్స్ పెంచుకొనే అవకాశం కల్పిస్తాం.. దానికి ముందుగా నిర్మాతలు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా ప్రజలకు భారం పెంచేలా కాకుండా సినిమాను ప్రజలు ఇష్టంతో చూసేలా చేయాలనీ, ఆన్‌లైన్ టికెట్ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని, ఆ విధానం కూడా త్వరలో రానున్నదని తెలిపారు.