విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి గురించి వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు ముందే స్పష్టంగా తెలుసని మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. మానసికంగా సిద్ధమైనందునే ఘటన జరిగిన తర్వాత జగన్‌లో ఎలాంటి హావభావాలు లేవని ఆయన వ్యాఖ్యానించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని కొట్టొద్దని జగన్ వారించినట్లు పోలీసు విచారణలో వెల్లడైందని కాల్వ వివరించారు. ఘటన జరిగిన తర్వాత నవ్వుతూ వెళ్లిన వ్యక్తి హైదరాబాద్ చేరుకున్నాక సానుభూతి కోసం ప్రయత్నించారని ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడిని అందరం ఖండించామని, ఆ ఘటన జరగకుండా ఉండాల్సిందని అనుకున్నామన్నారు. దాడి ఘటనను చిలవలు పలవలు చేయాలని హైదరాబాద్ నుంచి హస్తిన వరకు చేసిన కుట్రను మాత్రమే తాము ప్రశ్నించామని కాల్వ వివరించారు. జగన్ ఆడిన డ్రామా రక్తికట్టలేదని, ప్రజలెవరూ దీన్ని నమ్మలేదని గ్రహించిన వైసీపీ నేతలు సీన్‌ను ఢిల్లీకి మార్చారని కాల్వ దుయ్యబట్టారు.