ఆరేళ్లు నిండితేనే ఒకటవ తరగతిలో అడ్మిషన్ ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఇటీవల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మోడీ సర్కార్ లేఖలు రాసినట్లు సమాచారం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(NEP) 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కింద ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరని లేఖలో కేంద్రం వెల్లడించింది.
2024 – 25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక, 3 నుంచి 8వ సంవత్సరాల వయసు మధ్యలో పిల్లలకు 3 ఏళ్ల ప్రి స్కూల్, 1, 2వ తరగతులు పూర్తయిను పిల్లలను నేర్చుకునేందుకు మంచి అవకాశాలుంటాయని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో పేర్కొన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది.
పిల్లలను ఒకటవ తరగతిలో చేర్చించే వయసు పలు రాష్ట్రాల్లో పలు రకాలుగా ఉందని గతంలో లోక్‌సభకు ఇచ్చిన సమాధానంలో కేంద్రం చెప్పుకొచ్చింది. నూతన విద్యావిధానం, విద్యా హక్కు చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. అయితే, 6 ఏళ్లు నిండితేనె ఒకటో తరగతిలో అడ్మిషన్ పై తెలంగాణ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈ ఇష్యూపై విద్యా శాఖ అధికారులతో ఒక కమిటినీ వేసినట్టు సమాచారం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీనీ తెలంగాణ సర్కార్ అడాప్ట్ చేసుకోలేదు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆ తరవాత నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు తెలిపారు. కాగా, రేపు ఈ అంశం పై రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఈ నిబంధనను సీబీఎస్ఈ స్కూల్స్ అమలు చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏజ్, కేంద్ర ప్రభుత్వం ఒక ఏజ్ పెడితే ఇబ్బందులు వస్తాయని అధికారులు అంటున్నారు.