ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయకపోతే భవిష్యత్తులో తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని ఐరాస హెచ్చరించింది. రాబోయే రోజుల్లో లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశముందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియా తెలిపారు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు దేశాలన్నీ ఏకం కావాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల మందికి పైగా ప్రజలను పొట్టన పెట్టుకుందని, ఈ వైరస్ వల్ల ఆరోగ్య పరిస్థితులు దెబ్బతిన్నాయని ఐరాస అభిప్రాయ పడింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోవాలని, వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సూచించింది.
కరోనాను ఎదుర్కోవడంలో ప్రతిదేశం వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని సూచించింది. ఆఫ్రికాలాంటి పేద దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలపై దృష్టిపెట్టాలని జీ20 దేశాలకు దిశానిర్దేశం చేసింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోలేని దేశాలను జీ20 దేశాలు ఆదుకోవాలని అభిప్రాయపడింది. ఈ సమయంలో కేవలం సంఘీభావం తెలపడమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వివిధ దేశాలు కలిసి ముందుకు సాగాలని సూచించింది. అతి త్వరలోనే కరోనా వైరస్ వారి దేశాలను కూడా
తాకుతుందని, ఆయా దేశాలకు సాయం చేయకపోతే ఈ మహమ్మారితో దారుణమైన పర్యవసానాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని కారణంగా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలో చేస్తున్న ప్రయత్నాలను అన్నిదేశాలు పాటించాలని ప్రభుత్వాలను కోరింది. ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కుప్పకూలుతున్న ఆర్థికవ్యవస్థలపై దృష్టిసారించాలని తెలిపింది. అల్పాదాయ వర్గాలను, చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకోవాలని సూచించింది. సామాజిక, ఉద్యోగ భద్రత, వేతనాలు ఇవ్వడం, బీమా వంటివాటితో ఆదుకుని వారికి చేయూత నివ్వాలని కోరింది. ప్రపంచబ్యాంకు, ఐఎమ్‌ఎఫ్‌తోపాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న
దేశాలను ఆదుకోవాలని సూచించింది. ఇలాంటి విపత్కర సమయంలో స్వదేశీ వస్తు రక్షణ విధానంలో పలు దేశాలు వెనక్కి తగ్గాలంది. వివిధ దేశాల మధ్య ఉన్న వ్యాపార అడ్డంకులను, విభేధాలను పక్కన పెట్టాలని సరికొత్త సప్లై చైన్ వ్యవస్థలను పునరుద్ధరించాలని ఐరాస సూచించింది.