అమెరికాలో మెట్ గాలా వేడుక సోమవారం (అమెరికా కాలమానం ప్రకారం) అట్టహాసంగా ప్రారంభమైంది. బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె ఎప్పటిలాగే విభిన్న వస్త్రాలంకరణలో అందరి చూపును తమ వైపునకు తిప్పుకొన్నారు. రింగుల జుట్టు, సిల్వర్ రంగు గౌనులో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక దీపిక గులాబీ రంగు గౌనులో బార్బీ బొమ్మలా తయారయ్యారు. మూడేళ్ల నుంచి ఈ వేడుకకు హాజరవుతున్న ప్రియాంక.. ఈసారి తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి సందడి చేశారు. వీరిద్దరూ మొదట కలుసుకుంది కూడా ఈ వేడుకలోనే కావడం విశేషం.
ఏటా మెట్ గాలా కార్యక్రమాన్ని ఏదో ఒక థీమ్‌తో నిర్వహిస్తారు. ఈ సారి ‘క్యాంప్: నోట్స్ ఆన్ ఫ్యాషన్’ అనే థీమ్‌ను ఎంచుకున్నారు. అంటే వీలైనంత విభిన్నమైన దుస్తుల్లో ఫ్యాషన్ ఉట్టిపడేలా పింక్ కార్పెట్‌పై హోయలొలికించాలన్నమాట. ఈ వేడుకలో రిలయన్స్ సంస్థల అధినేత ముఖేశ్-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ కూడా హాజరై సందడి చేశారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన గౌనులో మెరిసిపోయారు. ఇషా ధరించిన డైమండ్ నెక్లెస్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. గతేడాది కూడా ఇషా మెట్ గాలాకు హాజరయ్యారు.
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్, కాస్ట్యూమ్ ఇన్‌స్టిట్యూట్ ఏటా నిర్వహించే కార్యక్రమమే ఈ ‘మెట్ గాలా’. ఈ వేడుకకు నటీనటులు విభిన్న దుస్తుల్లో హాజరవుతుంటారు. ఏటా ఒక్కో థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని నెలల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే విరాళాలను ఛారిటీలకు వినియోగిస్తారు. అత్యధిక విరాళాలు సేకరించే కార్యక్రమం ఇదే కావడం విశేషం. 2013లో నిర్వహించిన కార్యక్రమంలో 9 మిలియన్ డాలర్లు 2014లో 12 మిలియన్ డాలర్లు విరాళంగా సేకరించారు.