మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు మేము సైతం రూపంలో చేస్తున్న కృషి తెలిసిందే. వెండితెరపై తమ అందంతో, అభినయంతో తిరుగులేని కీర్తిని సంపాదించుకున్న తారలంతా వారి గ్లామర్ ప్రపంచాన్ని వీడి సామాన్యుల ప్రపంచంలో నిస్సహాయుల కోసం ఈ కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రానా, అఖిల్,రకుల్ ప్రీత్ సింగ్,తాప్సీ, మోహన్ బాబు,విష్ణు, తనికెళ్ల భరణి, నాగచైతన్య, సమంత సుమ, రెజీనా,మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ ఇలా టాలీవుడ్ లో అగ్ర స్థానంలో ఉన్న నటులందరీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమం చేయడం తెలుగులో ఇదే తొలిసారి. అందుకే ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని కార్యక్రమం, దీనికి తోడు సేవా కార్యక్రమం కావడంతో మేము సైతం సక్సెస్ అయ్యింది. అంతేకాక తమ అభిమాన నటులు సైతం వచ్చి కష్టాల్లో ఉన్న వాకి సాయపడమనడంతో, అందరూ మేము సైతం అంటున్నారు. కార్యక్రమంలో భాగంగా మంచు లక్ష్మి ఒక సమస్యను తీసుకురావడం, వచ్చిన గెస్ట్ ఆ సమస్య ను తీర్చడానికి, ఏదొక పని చేయడం చివరగా ఆ సంపాదించిన డబ్బు తో పాటుగా దానికి ఇంకొంత డబ్బు కలిపి ఆ సమస్యను తీర్చడం..ఇదీ మేము సైతం. అంతే కాదు ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే, డైరక్ట్ గానే కాదు, వారి బ్యాంక్ అకౌంట్ లో డబ్బు వేసి కూడా సాయపడొచ్చు అని మంచు లక్ష్మి చెప్తూనే ఉంది.
ఇటీవలే జరిగిన ఓ ఎపిసోడ్ లో సత్య, వీరబాబు అనే దంపతులు నడుపుతున్న శాంతివర్థన ఆశ్రమానికి, శ్రీమిత్ర గ్రూప్స్ 5లక్షలు విరాళమివ్వగా, మేము సైతం ప్రోగ్రామ్ తరపున 2లక్షలు అందించారు. అయితే, ఆ కార్యక్రమం తర్వాత రు.16లక్షల రూపాయలు శాంతి వర్థన ఆశ్రమానికి విరాళాల ద్వారా అందాయి. అంతేకాదు, గతంలో ఓ ఓల్డేజ్ హోమ్ కి కూడా ఇలానే బ్యాంక్ ద్వారా విరాళాలు దాదాపు రూ.20లక్షల వరకు అందాయి. ఈ కార్యక్రమానికి ఆశించిన దానికంటే ఒకింత ఎక్కువగానే ఆదరణ లభిస్తుండటం అందరూ సంతోష పడాల్సిన విషయమే. ఇలాంటి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకొచ్చినందుకు లక్ష్మి మంచు అటు సినీ పరిశ్రమ, ఇటు ప్రేక్షకులు అభినందిస్తున్నారు.