ఏపీ మంత్రివర్గం కేటాయింపులో ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ప్రాధాన్యం దక్కింది. ఈ నాలుగు జిల్లాలకు మూడేసి లెక్కన మంత్రి పదవుల్ని కేటాయించారు. అలాగే విజయనగరానికి రెండు, శ్రీకాకుళం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరుకు ఒక్కొక్కటి లెక్కన మంత్రి పదవులు దక్కాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన కృష్ణదాస్, విజయనగరం నుంచి బొత్స, పాముల శ్రీపుష్పవాణి, విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ను మంత్రి పదవులు వరించాయి. తూర్పుగోదావరి విషయానికి వస్తే… పిల్లి సుభాష్ చంద్రబోస్, కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్‌కు పదవుల్ని కేటాయించారు. ఇక పశ్చిమ విషయానికి వస్తే తానేటి వనిత, చెరుకువాడ రంగనాథరాజు, ఆళ్లనానిలకు అమాత్య పీఠాలు దక్కాయి.
కీలకమైన కృష్ణా జిల్లా నుంచి ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కింది. పేర్ని నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌కు జగన్ అవకాశం కల్పించారు. గుంటూరు జిల్లా విషయానికి వస్తే మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకట రమణ, ఆళ్ల రామకృష్ణారెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసులురెడ్డి, నెల్లూరు నుంచి మేకపాటి గౌతంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్ మంత్రివర్గంలో ఉన్నారు. అలాగే చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కర్నూలు జిల్లా నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మన జయరామ్‌లకు అవకాశం దక్కింది. అనంతపురం జిల్లా నుంచి శంకర్ నారాయణ, కడప నుంచి అంజాద్ బాషాకు అవకాశం లభించింది. మంత్రివర్గంలో సగం మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలూ, మైనార్టీలకే కేటాయించినట్టు వైసీపీ చెబుతోంది.