కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. దేశంలో 21 రోజుల పాటు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో నిరుపేదలు, సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ మూత పడటంతో రెక్కాడితే గాని డొక్కాడని రోజువారీ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కరోనా వైరస్ బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.
కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యల్లో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇక నిధుల విషయంలోనూ వెనుకడుగు వేసేది లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మరో వైపు సీఎం సహాయ నిధికి వ్యాపారవేత్తలు, సినీప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. తాజాగా మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ సీఎం సహాయ నిధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించింది. దీనికి సంబంధించిన చెక్కును మేఘా సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి సీఎం కేసీఆర్‌కు అందించారు. అంతే
కాకుండా అత్యవసర సేవల్లో ఉన్న సిబ్బందికి ఆహారం అందించనున్నట్టు వెల్లడించారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే మేఘా సంస్థ మరో సారి తన దాతృత్వాన్ని చాటుకుందంటూ మేఘా గ్రూప్ సంస్థలకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.