విప్లవ చిత్రాల నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి నటించి తాను దర్శకత్వం వహించి, సొంత నిర్మాణ సంస్థ స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించిన “మార్కెట్లో ప్రజాస్వామ్యం” సినిమా ఆడియో ఫంక్షన్ మంగళవారం సాయంత్రం మే 21న ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఆడియో వేడుకకు రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ నారాయణమూర్తితో ఉన్న అనుబంధాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆయన నికార్సయిన మనిషని ప్రశంసలు కురిపించారు. నా మిత్రుడికి ఆనందాన్ని కలిగించేందుకే నేను ఈ ఫంక్షన్‌కి వచ్చా. నారాయణమూర్తితో నాకు నాలుగున్నర దశాబ్దాల పరిచయం ఉంది అన్నారు.
సినిమా అంటే మూర్తికి పిచ్చి. కమర్షియల్ అయిపోతున్న ఈరోజుల్లో తన కమిటిమెంట్‌తో ముందుకు సాగుతున్నాడు. ఒకే బాటలో సినిమాలు చేయడం బహుశా ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు. అప్పటి నారాయణమూర్తి ఇప్పటి నారాయణమూర్తి ఒక్కడే. ఆస్తులు, అంతస్తులు కాదు సినిమానే ప్రాణం అనుకున్నాడు. సినిమానే ప్రేమించాడు, సినిమానే పెళ్లి చేసుకున్నాడు, సినిమాతోనే సంసారం చేస్తున్నాడు. దేశంలో ప్రజాస్వామ్యం అస్తవ్యస్తం అవుతోంది. నారాయణమూర్తి చిత్రం ఇందుకు నిదర్శనం అన్నారు.