చిరంజీవి, తమన్నా జంటగా మెహర్ రమేశ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం భోళా శంకర్. ఇందులో చిరంజీవికి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించింది. ఈ నెల 11న తెలుగులో విడుదలయిన సంగతి తెలిసిందే. సినిమా మెగాస్టార్ స్థాయిలో లేదనేది చాలామంది అభిప్రాయం.
దర్శకుడికి చిరంజీవి కావాల్సినంత సమయమిచ్చినా సరిగా ఉపయోగించుకోలేకపోయాడనేది టాక్. ఇప్పుడు భోళా శంకర్ సినిమాను హిందీలోనూ విడుదల చేయబోతున్నారు. తెలుగులో ఏకే ఎంటటైన్‌మెంట్స్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హిందీలో ఆర్కేడీ స్టూడియోస్ విడుదల చేయనుంది.
భోళా శంకర్ హిందీ వెర్షన్ ఆగస్టు 25న థియేటర్లలోకి వస్తోందని ఆర్కేడీ స్టూడియోస్ తాజాగా ఓ టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. చిరంజీవికి బాలీవుడ్ సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది.
తెలుగులో రిలీజ్‌కు ముందే భోళా శంకర్ సినిమాను హిందీలోకి డబ్ చేయాలని నిర్మాతలు అనుకున్నారు. డబ్బింగ్ రైట్స్‌ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆర్‌కేడీ స్టూడియోస్ భారీ రేటుకు దక్కించుకున్నట్లు తెలిసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల ఆలస్యంతో హిందీ వెర్షన్‌ను ఆగస్ట్ 25న విడుదల చేస్తున్నారు.
తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమాకు ఇది రీమేక్. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి యాక్షన్ అంశాలను జోడించి భోళాశంకర్‌ను తెరకెక్కించారు. కాన్సెప్ట్ అవుట్‌డేటెడ్ అని, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్‌తో పాటు ఏ అంశంలోనూ కొత్తదనం కనిపించలేదనే విమర్శలు వస్తున్నాయి.