అల్లు రామలింగయ్య శత జయంతి సంబదర్భంగా ఆయన జ్ఞాపకార్థం హైదరాబాద్ లో నిర్మించిన అల్లు స్టూడియోస్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై… స్టూడియోను ప్రారంభించారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఈరోజు అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ సినీ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారంటే… దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య మదిలో మెదిలిన ఆలోచనే కారణమని చెప్పారు. నటనపై ప్రేమతో మద్రాసుకు వెళ్లి, సినీ పరిశ్రమలో మంచి స్థానానికి చేరుకోవాలని ఆయన అనుకున్నారని… ఆ ఆలోచనే ఇప్పడు ఒక పెద్ద వ్యవస్థగా మారిందని అన్నారు. అందువల్ల అల్లు వారసులు ఆయనను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండాలని చెప్పారు.
అల్లు కుటుంబంలో భాగం కావడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు. అల్లు స్టూడియో అనేది ఒక స్టేటస్ సింబల్ అని అన్నారు. అల్లు అనే బ్రాండ్ తో తరతరాల పాటు జనాలు అల్లు రామలింగయ్యను గుర్తుంచుకునేలా స్టూడియోను నిర్మించారని చెప్పారు. ఎంతో మంది నటులు ఉన్నా అల్లు రామలింగయ్య వంటి నటులు ఉండటం అరుదని అన్నారు.