కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్‌హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోతేనే మంచిదని కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన ‘ఆనంద వికటన్’ అనే తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే డబ్బుమయమైపోయాయని వ్యాఖ్యానించారు. అందుకే వారిద్దరూ రాజకీయాల్లోకి రావొద్దని చిరంజీవి సూచించారు. నిజాయితీగా ప్రజలకు ఏదన్నా చేద్దామనుకున్నా ఏమీ చేయలేరంటూ తనకు రాజకీయాల్లో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ”నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నంబర్ 1 సూపర్ స్టార్‌గా ఉండేవాడిని. అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వచ్చాను. కానీ నా సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయాను. నా ప్రత్యర్థులు రూ.కోట్లు కుమ్మరించి నన్ను ఓడించారు. అలాగే పవన్‌కు కూడా జరిగింది ” అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ గెలుస్తుందని తాను అనుకున్నానన్నారు. కానీ అలా జరగలేదని చెప్పారు. ”సౌమ్యంగా ఉండే వ్యక్తులకు రాజకీయాలు టీ తాగినంత సులభమేం కాదు. కమల్ హాసన్, రజనీకాంత్ నా మాదిరిగా కాకపోయినా వారిద్దరికీ నా సలహా ఒక్కటే. రాజకీయాల్లోకి రావొద్దనే” అని అన్నారు. ఓటమిలు, ఎదురు దెబ్బలు ఎన్ని ఎదురైనా ప్రజలకు మంచి చేయాలనుకుంటే రాజకీయాల్లోకి రావొచ్చని వ్యాఖ్యానించారు. ఏదో ఒక రోజు పరిస్థితులు నిన్ను మార్చవచ్చు అని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌కు చెందిన మక్కల్ నీది మయ్యం పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో నిలపగా.. రజనీకాంత్ ఇంకా రాజకీయ పార్టీని కూడా ప్రకటించని విషయం తెలిసిందే.
చిరంజీవి కథానాయకుడిగా తెరపైకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నయనతార హీరోయిన్. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, తమన్నా, జగపతిబాబు, విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.