సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేశారు. శనివారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ‘విన్నర్’ అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించింది. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై ‘విన్నర్’ రూపొందుతోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ.. ”తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. ‘విన్నర్’ అనే టైటిల్ చక్కగా సరిపోతుందని పెట్టాం. మా హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌ని ప్రకటించడం, ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. తమన్ చాలా మంచి సంగీతాన్నిస్తున్నారు. ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం” అని అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ.. ”మా హీరో ఎప్పుడూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. ఆయనకు తగ్గట్టే ‘విన్నర్’ అనే టైటిల్ కుదిరింది. కథానుగుణంగా ఉండే టైటిల్ ఇది. ఇప్పటికే కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఈ నెల 17 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ చేస్తాం. నవంబర్ 3 నుంచి 22 వరకు ఫారిన్‌లో మరో షెడ్యూల్ ఉంటుంది. ఉక్రెయిన్‌లో పాటల్ని, ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ ని చిత్రీకరిస్తాం. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాలోని ప్రతి ఫ్రేమూ గ్రాండ్‌గా ఉంటుంది. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంట చక్కగా కుదిరింది. తమన్ మంచి బాణీలనిస్తున్నారు. అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన రచన ఆకట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి కథనిచ్చారు” అని తెలిపారు.