తెలంగాణలో ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ పేరిట విడుదలైన ఈ లేఖలో రాజకీయ పార్టీల తీరును దుయ్యబట్టారు. అధికార టీఆర్‌ఎస్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని.. ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో 9 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేసి కేసీఆర్ ఎన్నికలకు వెళ్లారని లేఖలో పేర్కొన్నారు.
మహాకూటమితో పాటు బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను కూడా హరిభూషణ్ విమర్శించారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఒరగబెట్టిందేమీ లేదని లేఖలో పేర్కొన్నారు. మహాకూటమి పేరుతో సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు కాంగ్రెస్, టీడీపీతో జట్టు కట్టడం బూర్జువా పార్టీలకు ఓట్లు సంపాదించి పెట్టడమేనని విమర్శించారు. వామపక్ష పార్టీలు ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి, విప్లవోద్యమాలకు తిలోదకాలిచ్చి పదవుల పంపకంలో మునిగి తేలుతున్నాయని ఆరోపించారు. బూటకపు ముందస్తు ఎన్నికలను బహిష్కరించి ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని ఆయన లేఖలో కోరారు.