Homeతెలుగు Newsఅరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు

అరకు ఎమ్మెల్యేను కాల్చిచంపిన మావోయిస్టులు

అరకు (టీడీపీ) ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును దారుణంగా కాల్పిచంపారు. మావోయిస్టుల కాల్పుల్లో అరకు ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతి చెందారు. ఈ కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ కూడా మరణించారు. డంబ్రీగూడ మండలం లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 60 మంది మావోయిస్టులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల దాడిని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌ నిర్ధారించారు. ఘటనాస్థలానికి భద్రతా బలగాలు బయలుదేరి వెళ్లాయని తెలిపారు. ఏవోబీ కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

9 20

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు ఈరోజు ఉదయం 11 గంటల వరకూ అరకులోనే ఉన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సివేరు సోమతో కలిసి లిప్పిట్టిపుట్టు గ్రామానికి క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. అక్కడ గ్రామస్థులతో చర్చిస్తుండగా సుమారు 60 మంది మావోయిస్టులు వారిని చుట్టుముట్టారు. ఇటీవల చోటుచేసుకున్న పలు అంశాలపై వారు ఎమ్మెల్యేతో గంటసేపు చర్చించారు. ఎమ్మెల్యేకు చెందిన గూడ క్వారీపై మావోయిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్వారీ పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నందున మూసివేయాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఏదైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. బెదింపులకు దిగడం సరికాదని వారించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మావోయిస్టులు ఎమ్మెల్యే సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోముకు తుపాకుల ఎక్కుపెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

విశాఖ మన్యంలో మావోయిస్టులు చాలాకాలం నుంచి స్తబ్దుగా ఉన్నారు. గ్రే హౌండ్స్‌ దళాలు, ఒడిశా పోలీసులు కూంబింగ్‌ ముమ్మరం చేయడంతో మావోయిస్టులు ఉనికే ప్రశ్నార్దకంగా మారింది. అయితే ఇటీవల కాలంలో వారు తమ ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వారోత్సవాలు జరపడం, పోస్టర్లు ఏర్పాటుచేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు భద్రత లేకుండా క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లొద్దని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. ఈ క్రమంలోనే భద్రత లేకుండా గ్రామ పర్యటనకు వెళ్లిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు మావోయిస్టుల తూటాలకు బలయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu