కోలీవుడ్ నటి త్రిష పై తమిళ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద వివాదమే సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై సినీలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో తమిళ, టాలీవుడ్ చిత్ర ప్రముఖులు త్రిషకు అండగా నిలిచారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ ఆయన మాత్రం క్షమాపణలు చెప్పేదే లేదని తేల్చి చెప్పారు.
అయితే, పరిస్థితి తీవ్రత నేపథ్యంలో తాజాగా త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వెనక్కి తగ్గారు. ఈ మేరకు త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. అయితే ఈ పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. ఈ వివాదం మగిసింది. అంతా అయిపోయింది అనుకుంటున్న సమయంలో మరోసారి ఈ గొడవ కొత్త రూపం సంతరించుకుంది.
త్రిషకు బహిరంగ క్షమాపణలు చెప్పిన మరుసటి రోజు మన్సూర్ ఆలీ ఖాన్ మీడియా ముందు మాట్లాడుతూ.. పరువునష్టం, పరిహారం, క్రిమినల్, ఇతరులను రెచ్చగొట్టడం, ముందస్తు అల్లర్లు, నగరంలో 10 రోజులపాటు ప్రజా శాంతికి విఘాతం కలిగించడం వంటి అన్ని కేటగిరీల కింద త్రిషకు, ఖుష్బూ, చిరంజీవిలకు నోటీసులు పంపిస్తున్నానంటూ షాక్ ఇచ్చాడు. తన లాయర్ ధనంజయన్ ద్వారా సోమవారం కోర్టులో కేసు వేయబోతున్నట్లు తెలిపారు. వారి ముగ్గురికి నోటీసులు జారీ చేస్తానని ఆయన ప్రకటించాడు.