ప్రముఖ టీవీ హోస్ట్ ఓంకార్ తాజాగా ‘మ్యాన్షన్ 24’ అనే వెబ్ సిరీస్‌తో తెరకెక్కిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను ఈరోజు విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. భారీ తారాగణంతో ఈ సిరీస్‌ను ఓంకార్ రూపొందించారు. సత్యరాజ్, అవికా గోర్, బిందుమాధవి, సిమ్రన్, రావు రమేష్, జయప్రకాశ్, తులసి, రాజీవ్ కనకాల, అర్చన జియోస్, అమర్‌దీప్, అయ్యప్ప పి శర్మ, మానస్, ‘బాహుబలి’ ప్రభాకర్, అభినయ, విద్యుల్లేఖ రామన్, ‘ఛత్రపతి’ శేఖర్, సూర్య, నళిని, శరధ్ దంగర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓక్ ఎంటర్‌టైన్మెంట్‌పై ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి ఈ సిరీస్‌ను నిర్మించారు. వికాశ్ బాదిషా సంగీతం సమకూర్చారు. బి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందించారు. అశోక్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్. ఆదినారాయణ ఎడిటర్. దేశద్రోహిగా ముద్రపడిన తండ్రి నిజాయతీని నిరూపించే కూతురిగా వరలక్ష్మీ శరత్‌కుమార్ ఈ సిరీస్‌లో కనిపించనున్నారు. ఆమె తల్లిదండ్రులుగా సత్యరాజ్, తులసి నటించారు. దేశ సంపదను దోచుకుని కనిపించకుండా పోయాడని సత్యరాజ్‌పై నిందపడుతుంది.
ఆయన మ్యాన్షన్ హౌస్‌కి వెళ్లిన తరవాత నుంచీ కనిపించకుండా పోవడాన్ని వరలక్ష్మీ శరత్‌కుమార్ ట్రైలర్‌లో హైలైట్ చేస్తున్నారు. అయితే, అక్కడికి వెళ్లి కనిపించకుండా పోయారంటే ఇక ఆయన గురించి మరిచిపోవడం మంచిదని పోలీసులు సహా అందరూ సలహా ఇవ్వడం ఆసక్తికర అంశం. ఇంతకీ ఆ మ్యాన్షన్ హౌస్‌లో ఏముంది? తన తండ్రి ఏమయ్యారు? అనే విషయాలు కనుక్కోవడానికి వరలక్ష్మీ శరత్‌కుమార్ మ్యాన్షన్ హౌస్‌కి వెళ్లారు. ఆ తరవాత హారర్ థ్రిల్లర్‌ను మనం సిరీస్‌లో చూడాల్సిందే.