ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన ‘మన్మథుడు 2’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ దీనికి వేదికైంది. నటీనటులు నాగ్, రకుల్‌ప్రీత్ సింగ్, లక్ష్మి, వెన్నెల కిశోర్, దేవదర్శిని తదితరులు హాజరై సందడి చేశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. నాగ్ సతీమణి, నటి అమల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, వయాకామ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
రిలీజ్ వేడుకలో మొదట లక్ష్మి మాట్లాడుతూ.. ‘ఇది సినిమా కాదు. అనుభవం. మన దర్శకుడి గురించి ముందు చెబుతా. యాక్టింగ్ నేర్పించే దర్శకుడు ఇతడు. మేం అంతగా కష్టపడలేదు. సెట్‌లో నటీనటుల మధ్య ఈగో అనేది లేకుండా ఉంటే చాలా బాగుంటుంది. ఆ సినిమా హిట్ అందుకుంటుంది. ఇప్పుడు ఈ చిత్రం కూడా అదేవిధంగా విజయం సాధిస్తుంది. మా సెట్‌లో ఎవ్వరికీ అహంకారం లేదు. మా నిర్మాతకు లేదు, హీరోకూ లేదు. అందరూ చాలా చనువుగా ఉన్నారు. సినిమా అయిపోయిందా.. అనుకున్నాం. ఈ సినిమాకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు నేను పడిపడి నవ్వుకున్నాను. కొన్ని సీన్లు నాగ్, కిశోర్ చేశారు, ఫన్నీగా ఉంటాయి. నాగార్జున ఇంకో స్వరూపం ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా క్రెడిట్ మొత్తం దర్శకుడికి వెళ్తుంది. ముందు మాట్లాడమని నన్ను పిలిచారు.. ఎందుకో తెలుసా?. నేను నాగేశ్వరరావు గారితో నటించా, నాగార్జునతో నటించా, ఆయన కొడుకుతో నటించా. నా జనరేషన్ నటులు ఎవరూ ఇలా చేయలేదు. ఈ మూడు జనరేషన్‌లతో నటించా. ఈ సినిమా చూసినప్పుడు మీకు మీ కుటుంబం గుర్తొస్తుంది. ఇంటికి వెళ్లిపోతారు’ అని అన్నారు.
అనంతరం వెన్నెల కిశోర్ మాట్లాడుతూ.. ‘ఇది క్యూట్ ఫ్యామిలీ కథ. లక్ష్మిగారితో నటించడం సంతోషంగా ఉంది. దేవదర్శిని నన్ను చాలా ఆటపట్టించారు. ఆమె మంచి నటి కాబట్టి ఎన్ని చేసినా భరించాను (రాహుల్ కల్పించుకుంటూ.. దేవదర్శిని మీరు వేదికపై లేరు కాబట్టి ఏదేదో చెబుతున్నాడు. మనం వీడిపని తర్వాత చెబుదాం)’ అని చెప్పారు.
నేను చేసిన మొదటి బిగ్‌స్టార్ చిత్రం ‘మన్మథుడు’. ఈ సినిమాతో నాకు అనేక అనుభవాలు ఉన్నాయి. ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని నాగ్ సర్‌కి చెప్పారు. రాహుల్ డైరెక్షన్ బాగుంది. రకుల్ ఎప్పటిలాగే లవ్లీగా ఉన్నావు’ అని దేవిశ్రీ అన్నారు.
ఈ చిత్రంలో నాగ్ ప్రత్యేక లుక్‌ను అమల ఆవిష్కరించారు. ‘మన్మథుడు’ తాతయ్య లుక్‌లో కనిపించారు. ‘మన్మథుడు 2′ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’ అని అమల చెప్పారు.
రాహుల్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు నేనే అవంతిక పాత్ర చేయాలని నిర్ణయించుకున్నా. ఇలాంటి పాత్రలు చాలా అరుదుగా ఉంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో నేను బాగా ఎంజాయ్ చేసిన పాత్ర ఇది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ముందు నుంచే నాకు రాహుల్ తెలుసు. నాగార్జున్‌ను కింగ్ అని ఎందుకు అంటారో నాకు ఈ సినిమా ద్వారా అర్థమైంది. అది ఆయనకున్న క్రేజ్. అభిమానుల్లో ఆ క్రేజ్ ఎందుకుందో నాకు ‘మన్మథుడు 2′ వల్ల అర్థమైంది. ఆయన చిత్ర బృందాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. లక్ష్మి గారితో నటన ఎంతో అనుభవం ఇచ్చింది. ఆమె ఎంతో మంచి వ్యక్తి’ అని రకుల్ మాట్లాడారు.
అనంతరం నాగచైతన్య ప్రసంగిస్తూ.. ‘ఈ మధ్య నాన్న ప్రీ రిలీజ్ వేడుకకు రావాలంటే భయంగా ఉంది. ఇంతకు ముందు మీరు మీ తండ్రి సోదరుడిలా ఉన్నారు అనేవారు. సరేలే బ్రదరేగా అనుకున్నాం. కానీ ఇప్పుడు స్క్రిప్టు కూడా అలానే ఎంచుకుంటున్నారు. ఈ వయసులోనూ మీరు లవ్ స్టోరీ ఎంచుకోవడం గొప్ప విషయం నాన్నా. నాన్న హిట్ వచ్చినా, ఫ్లాప్ వచ్చినా.. అదే ధైర్యంతో ముందుకు వెళ్తుంటారు. అది గొప్ప విషయం’ అని నాగచైతన్య చెప్పారు.
ఆగస్టు నెల నాకు చాలా ఇష్టం. ఇటీవల బిగ్‌బాస్ ప్రారంభమైంది. తొమ్మిదిన ‘మన్మథుడు 2’ విడుదల కాబోతోంది. ఈ నెల ఆఖరుకు నాకు 30 ఏళ్లు నిండుతాయి. కరెక్టేగా (నవ్వుతూ). మీరు ఓ ప్రేమకథలో నటించడం ఏంటని చాలా మంది అడిగారు. ఇది ఓ ఫ్రెంచ్ సినిమా. ఓ సంవత్సరం క్రితం ఆ సినిమా నాకు చూపించారు. ఏ వయసులోనైనా ప్రేమించొచ్చు అని చెప్పే కథ ఇది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అంటున్నారు. కాదు నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. కొడుకులు లేరు. నాకు ఎంతో ఇష్టమైన సినిమా ‘మన్మథుడు’. అఖిల్ షూటింగ్‌లో ఉన్నాడు అందుకే రాలేదు. వెన్నెల కిశోర్ రోజూ నాతో కలిసి బాగా తినేవాడు. నువ్వు తప్పా నాకు ఎవ్వరూ కంపెనీ ఇవ్వలేదు. థాంక్యూ సుకుమార్.. నన్ను అందంగా తయారు చేశావ్. చాలా కామెంట్లు వస్తున్నాయి. రకుల్‌తో పని చాలా సులభం. ఆమె గొప్ప నటి. ఆరోగ్యం గురించి ఆమె నుంచి చాలా నేర్చుకోవచ్చు. థాంక్యూ రకుల్’ అని నాగ్ చెప్పారు.