బాలీవుడ్ నటి కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’. ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్రబృందం ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది. బ్రిటిషర్ల జాతీయ జెండాను ఖడ్గంతో చీలుస్తున్న సన్నివేశంతో మణికర్ణిక ఎంట్రీ హైలైట్‌గా నిలిచింది.
ఈ టీజర్‌లో ‘తన దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేసింది.. ఆమే ఝాన్సీ కీ రాణీ’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ధీర వనిత లక్ష్మీబాయి పాత్రలో కంగనా ఒదిగిపోయారు. ‘ఇతిహాసాన్ని మార్చిన ఓ రాణి కథ. ఆమె ఇచ్చిన ఝలక్ చూడండి’ అంటూ కంగన ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చారు. ఇతర కారణాల వల్ల దర్శకుడు క్రిష్ బిజీగా ఉండడంతో ఈ సినిమాలోని ఆఖరి షెడ్యూల్‌కు కంగననే దర్శకత్వం వహించారు. జిషుసేన్ గుప్తా, సురేశ్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, డ్యానీ, అంకితా లోఖాండే తదితరులు కీలక పాత్రలు పోషించారు. వచ్చే జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.