ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ గురించి నటుడు, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు. శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో తాను ఫోన్లో మాట్లాడినట్లు విష్ణు తెలిపారు. ‘‘ఏఐజీ ఆస్పత్రి బృందంతో మాట్లాడాను. శివశంకర్ మాస్టర్ కోలుకునేందుకు అన్నివిధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్యం కోసం వైద్యులు ఎంతగానో శ్రమిస్తున్నారు. మాస్టర్ రెండో కుమారుడు అజయ్తోనూ ఫోన్లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మీ ప్రార్థనలు ఎంతో అవసరం’’ అని విష్ణు ట్వీట్ చేశారు.
కరోనా బారిన పడి గడిచిన నాలుగు రోజుల నుంచి హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో శివశంకర్ మాస్టర్ చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన సతీమణి, పెద్దకుమారుడికి సైతం వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి బిల్లులు చెల్లించడంలో మాస్టర్ కుటుంబసభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్, ధనుష్.. తమ వంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు.
Spoke with #AIG hospital and they assured the best care to SivaShankar Master. They are extending the best possible help and His son Mr. Ajay is also briefed. All we need now is our prayers for Master.
— Vishnu Manchu (@iVishnuManchu) November 26, 2021