‘మా’ ఎన్నికల్లో విజయం సాధించి నూతన ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నటుడు మంచు విష్ణు. ఈ మేరకు ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సమక్షంలో నేడు శనివారం ఉదయం నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశారు. విష్ణుతో పాటు ఆయన ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 సభ్యులూ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. దీంతో, ‘మా’లో నూతన కార్యవర్గం కొలువుదీరింది.
ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్లో నిర్వహించిన ఈ ప్రమాణస్వీకారోత్సవానికి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని.. కొత్త కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ‘మా’ కార్యాలయంలో విష్ణు తన కార్యవర్గ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విష్ణుకి మద్దతుగా ఉన్న నరేశ్ సైతం ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘మా’ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారానికి ప్రకాశ్‌రాజ్, అతని ప్యానెల్ సభ్యులెవరూ హాజరు కాలేదు. మరోవైపు, ఇటీవల బాలకృష్ణను కలిసిన మంచు విష్ణు చిరంజీవిని సైతం కలిసి ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తానని తెలిపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో నేటి కార్యక్రమంలో చిరంజీవి కానీ.. ఆయన కుటుంబానికి చెందిన హీరోలు కానీ కనిపించకపోవడం గమనార్హం.