Bangalore Rave Party: బెంగళూరులో రేవ్ పార్టీలో నటి హేమ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం బెంగళూరు శివార్లలో ఒక రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఆ సమయంలో అక్కడ హేమ కూడా పట్టుబట్టడం సంచలనంగా మారింది.
అయితే హేమ తన పేరుని కృష్ణవేణిగా మార్చి చెప్పడంతో విషయం బయటపడటానికి కొంత సమయం పట్టింది. ఈలోపు ఆమె పేరు మీడియాలో వచ్చినా సరే అది తప్పుగా వస్తుందని తాను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ ఆమె వీడియో రిలీజ్ చేసింది. అయితే పోలీసులు క్రాస్ చెక్ చేసుకుని ఆమె అదుపులోనే ఉందని ఆమె ఫోటో రిలీజ్ చేశారు.
ఆమె వీడియో రిలీజ్ చేసిన డ్రెస్, పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలోని డ్రెస్ ఒకేలా ఉండడంతో ఆమె బెంగళూరు పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు అయింది. దీంతో పోలీసులు పార్టీలో పాల్గొన్నందుకు ఒక కేసు కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు మరో కేసు ఆమె మీద నమోదు చేశారు. ఇక ప్రస్తుతానికి నోటీసులు జారీ చేసి ఆమెను వివరణ కోరారు.
అయితే ఇదే విషయం మీద మా అధ్యక్షుడు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కొన్ని మీడియా సంస్థలు హేమ మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నాయని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. సరిగా చెక్ చేసుకోకుండా ఎలాంటి సమాచారాన్ని షేర్ చేయవద్దని ఆయన కోరారు. ఆమె నేరం చేసినట్లు ప్రూవ్ అయ్యే వరకు ఆమెను దోషి అనకుండా ఉండాలని కోరారు.
ఆమె కూడా సమాజంలో ఒక భార్యగా, ఒక తల్లిగా తన ఇమేజ్ ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఖండిస్తుందని, పోలీసులు కనుక హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు సమర్పిస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కచ్చితంగా ఆమె మీద చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అయితే అప్పటివరకు ఈ విషయాన్ని సంచలనంగా మార్చే ప్రయత్నం చేయవద్దని మంచు విష్ణు కోరాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది.