HomeTelugu Big Stories'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం

Manchu Vishnu as MAA electi
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానళ్లు పోటీ పడ్డాయి. సాధారణ ఎన్నికలను తలపించాయి. 220 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇరు ప్యానళ్ల సభ్యులు పరస్పరం విమర్శలు చేసుకుని ఎన్నికల ప్రక్రియను మరింత వేడెక్కించారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో సైతం చిన్న చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకానొక సమయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తోపులాటకు దారితీసింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని మంచు విష్ణు ప్యానల్ సభ్యులు ఆరోపణలు చేశారు.

ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో ‘మా’ సభ్యులు స్పష్టమైన తీర్పునిచ్చారు. ‘మా’ చరిత్రలోనే అత్యధిక పోలింగ్‌ నమోదైంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉండగా మరికొంతమంది ఓటింగ్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఇరు ప్యానళ్ల విజ్ఞప్తితో ఓటింగ్ సమయాన్ని మరో గంటపాటు పొడిగించారు. ‘మా’లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 605మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నటి హేమ, శివబాలాజీ చేయి కొరకడం వివాదాస్పదమైంది.

ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి జనరల్‌ సెక్రటరీగా పోటీ చేసిన జీవిత రాజశేఖర్‌పై మంచు విష్ణు ప్యానల్‌ నుంచి రఘుబాబు గెలిచారు. ఉత్కంఠ పోరులో రఘుబాబు 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. వైస్‌ ప్రెసిడెంట్‌గా విష్ణు ప్యానల్‌ నుంచి మాదాల రవి గెలుపొందారు.

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికోసం ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌, మంచు విష్ణు ప్యానల్‌ నుంచి బాబుమోహన్‌ పోటీ పడ్డారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన హోరా హోరీ పోరులో శ్రీకాంత్‌ విజయం సాధించారు.

‘మా’ కోశాధికారిగా విష్ణు ప్యానల్‌ నుంచి శివబాలాజీ విజయం సాధించారు. ప్రకాశ్‌ ప్యానల్‌ నుంచి పోటీ చేసిన నాగినీడుపై 32 ఓట్ల తేడాతో శివబాలాజీ ఆధిక్యం సాధించారు. శివబాలాజీకి 316 ఓట్లు రాగా, నాగినీడుకు 284 ఓట్లు పోలయ్యాయి.

మంచు విష్ణు ప్యానెల్‌ నుంచి కార్యవర్గ సభ్యులుగా మాణిక్, హరినాథ్ , బొప్పన విష్ణు, పసునూరి శ్రీనివాస్, శ్రీలక్ష్మి, జయవాణి, శశాంక్, పూజిత గెలుపొందారు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లో అనసూయ, సురేశ్‌ కొండేటి, కౌశిక్‌, శివారెడ్డి కార్యవర్గ సభ్యులుగా గెలుపొందారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu