విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు పుట్టినరోజు. ఈ రోజు ( మార్చి19) ఆయన 72వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. స్వర్గం-నరకం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొదట్లో విలన్‌గా నటించిన ఆయన ఆతరువాత హీరోగా నటించాడు. సీనియర్ ఎన్టీఆర్, రజనీకాంత్‌లతో కూడా స్రీన్ పంచుకున్నాడు.
500లకు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు విభిన్న పాత్రలు పోషించాడు. నిర్మాతగా పలు సినిమాలు తెరకెక్కించాడు. పలు అవార్డులు అందుకున్న ఆయన బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
2020 లో ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాలో నటించాడు. ఇటీవలే సినిమాలు తగ్గించిన మోహన్ బాబు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రోజెక్ట్ అయిన కన్నప్ప సినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నాడు. మోహన్ బాబు పుట్టిన రోజుని ఆయన కొడుకులు విభిన్నంగా జరుపుతున్నారు.
మంచు విష్ణు కన్నప్ప కామిక్ బుక్ ని మోహన్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా.. మార్చ్ 19న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ పుస్తకం కావాల్సిన వాళ్ళు నా ఇన్‌స్టాగ్రామ్ కి మెసేజ్ చేయండి. నా టీం మిమ్మల్ని కాంటాక్ట్ అయి మీకు పుస్తకం పంపిస్తారు. దీనికి ఎలాంటి డబ్బులు కట్టనవసరం లేదు. ఈ బుక్ అందరికి ఫ్రీగా ఇస్తున్నాను. ఎందుకంటే కన్నప్ప చరిత్రని అందరికి తెలియచేయాలి అని తెలిపారు విష్ణు.
మంచు మనోజ్ కూడా తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజును ఈసారి కాస్త భిన్నంగా నిర్వహించారు. మోహన్ బాబు పుట్టినరోజు ముందస్తు వేడుకలను తిరుపతి జిల్లా రేణిగుంటలోని అభయక్షేత్రం అనే దివ్యాంగుల పునరావాస కేంద్రంలో నిర్వహించారు. దివ్యాంగుల మధ్య కేక్ కటింగ్ చేసి మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భార్య మౌనికతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు మంచు మనోజ్. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగానే వ్యక్తిగత విషయాలను సైతం మంచు మనోజ్ పంచుకున్నారు. తన భార్య ఇప్పుడు గర్భవతి అని చెప్పిన మనోజ్.. మీ అందరి ఆశీర్వాదాలు తనపై ఉండాలని కోరారు.మోహన్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన మామ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలంటూ మనోజ్ సతీమణి మౌనిక ఆకాంక్షించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు తమ చేతుల మీదగా మునుముందు కూడా నిర్వహిస్తామని తెలియజేశారు